తెలంగాణాలో అధికార పార్టీకి చెందిన అనేక మంది ఉద్దండ నాయకులు సోఫాల్లో ఆసీనులై కనిపిస్తున్న చిత్రమిది. ఫొటోను ఎడమ నుంచి కుడికి జాగ్రత్తగా పరిశీలించండి. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణలు ఉన్నారు కదా? ఇదే ఫొటోలో తుమ్మల, బాలసానిల మధ్య మరో ముఖ్య నాయకుడు కూడా ఉన్నారు. ఆయన తప్ప అందరూ అధికార పార్టీ నేతలే. ఇంతకీ ఆయన ఎవరనేగా సందేహం? తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. అశ్వారావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మెచ్చా ఆయా అధికార పార్టీ నేతల మధ్య కూర్చున్న ప్రదేశం ఏమిటో తెలుసా? భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసం. ఇందులో విశేషం ఏముందీ…అంటే?

ఇతర పార్టీల తరపున గెల్చిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, నాయకులతో కలసి పాల్గొనడం సాధారణమే. కానీ అధికార పార్టీకి చెందిన నాయకుల నివాసాలకు ఇతర పార్టీల నేతలు వెళ్లినపుడే రాజకీయ ప్రాధాన్యతపై ఊహాగానాలు, అంచనాలు చోటు చేసుకుంటుంటాయి. అలాగని టీడీపీకి చెందిన మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరే పరిణామాలు కూడా ప్రస్తుతానికి లేవు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తెలంగాణాలో గెల్చిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లికి చెందిన సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే కేసీఆర్ పార్టీకి జై కొట్టారు. సండ్ర వెంట అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా కూడా వెడతారని, తెలంగాణా అసెంబ్లీలో టీడీపీ జాడ లేకుండా పోతుందని ప్రచారం జరిగినప్పటికీ, ఆయన ‘నో’ అన్నారు. సండ్రకు లభించే పదవి కోసం తమ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారాలని మెచ్చా నాగేశ్వరరావు అనుయాయులు అప్పట్లో బాహాటంగానే ప్రశ్నించారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని మెచ్చా కూడా గతంలోనే స్పష్టం చేశారు. మరి… అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి తుమ్మలతో అశ్వరావుపేట ఎమ్మెల్యే రాసుకు, పూసుకు తిరగడం దేనికంటే…?

వాస్తవానికి మెచ్చా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో తుమ్మల సమకాలికుడు. ఓ రకంగా తుమ్మలకు శిష్యుడు కూడా. దమ్మపేట మండలం మొద్దులగూడెం అనే ఓ చిన్న గిరిజనగూడేనికి సర్పంచ్ స్థాయి నుంచి నేరుగా అశ్వారావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన మెచ్చా నాగేశ్వరరావు తన రాజకీయ ప్రస్థానంపై అనేక సందర్భాల్లో ఏమంటారో తెలుసా? ‘నేను సాధారణ సర్పంచ్ నుంచి ఈ స్థాయికి రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ. రిజర్వేషన్ కారణంగానే నేను ఎమ్మెల్యేనయ్యాను. అధికార పార్టీలో చేరితే కేసీఆర్ వద్ద గల వంద మంది ఎమ్మెల్యెేల్లో నేనూ ఒకడిని. కానీ ఇప్పడు చంద్రబాబు వెనుక సీట్లోనే కూర్చునే అవకాశం. తెలంగాణాలో ఆ పార్టీకి ఏకైక ఎమ్మెల్యేను నేను.’ అని చెబుతుంటారు. ఇక తుమ్మలతో కలిసి తిరగడం, ఆయన ఇంటికి వెళ్లడం ఏమిటి? అంటే, మెచ్చాకు తుమ్మలతో గల దశాబ్ధాల సాన్నిహిత్యం అటువంటిది. ఎంతగా అంటే తుమ్మలను ‘నువ్వు’ అని సంబోధించగలిగినంత. టీడీపీ, టీడీపీనే…తుమ్మల…తుమ్మలే… పార్టీలు, గట్రా సెకండరీ. అందుకే తుమ్మల నివాసంలో మెచ్చా నాగేశ్వరరావు తాజా భేటీ సీన్ మొదటిదీ కాదు, చివరిది కూడా కాకపోవచ్చు. అదీ అశ్వారావుపేట ఎమ్మెల్యే శైలి. ఈ దృశ్యాన్ని పరిశీలించి ప్రశ్నించేందుకు ప్రస్తుతం చంద్రబాబు కూడా సాహసించకపోవచ్చు. అటు ఆంధ్రాలో ఆయన కష్టాలు ఆయనవి మరి!

Comments are closed.

Exit mobile version