తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు ‘బ్రదర్’ అంటూ అప్యాయంగా పిల్చుకునే వల్లభనేని బాల గంగాధర చౌదరి (86) ఇక లేరు. ఖమ్మం నగరానికి చెందిన ఆయనను అందరూ ‘చౌదరి గారూ…’ అంటూ సంబోధిస్తారు. ఆ చౌదరి కొద్దిసేపటి క్రితం మరణించారు. మూడు, నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి మరణం తెలుగుదేశం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సారణంగానైతే ఈయన మరణం వార్త కాకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీతో ఆయనకు గల దశాబ్ధాల అనుబంధం, పార్టీ అంటే ప్రాణం తీసుకునేంత అభిమానాన్ని తన చివరి శ్వాస వరకు అణువణువునా నింపుకున్న గంగాధర చౌదరి పార్టీలకతీతంగా అందరికీ సుపరిచితుడు కావడమే విశేషం. ఖద్దరు దుస్తులు ధరించి ఖమ్మం వీధుల్లో కాలినడకన కనిపించే ఆయన ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరమే.
ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ జెండాను నాటిన ఇద్దరంటే ఇద్దరు వ్యక్తుల్లో గంగాధర చౌదరి ఒకరు. కాంగ్రెస్, కామ్రేడ్స్ ప్రాబల్యం గట్టిగా ఉన్న రోజుల్లో బసవ నారాయణ అనే వ్యక్తితోపాటు గంగాధర చౌదరి మాత్రమే ఖమ్మంలో టీడీపీ జెండాను మోసేందుకు సాహసించారు. కానీ ఈ చౌదరికి పార్టీపరంగా లభించిన పదవేమీ లేకపోవడమే అసలు విషాదం. ఖమ్మం నగరంలో కాలినడకన మాత్రమే కనిపించే చౌదరి తనకు తెలిసినవాళ్లు కనిపిస్తే పేరుపెట్టి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. కుశల ప్రశ్నలు వేస్తూనే… ‘అన్నగారు (ఎన్టీఆర్) మన గురించి ఏమంటున్నారు? కాస్త మీ హైదరాబాద్ రిపోర్టర్లను అడిగి కనుక్కోకూడదా? పార్టీకి నేనేమైనా లోటు చేస్తున్నానా? ఇంకా ఏమైనా చేయాలా? అని తపన పడేవారు. ఎన్టీఆర్ మరణానంతరం కూడా చంద్రబాబు గురించి కూడా చౌదరి ఇలాగే అడిగేవారు. ‘బాబు ఏమంటున్నారు? మనకే రాజ్యసభ ఇస్తామనుకున్నారట. కానీ ఏవో సమీకరణల వల్ల ఇవ్వలేకపోయారట… అని ఆవేదన చెందుతుండేవారు.
ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో గంగాధర చౌదరికి ఒకప్పుడు ఓ హోటల్ ఉండేది. ‘కోడి పుంజు హోటల్’గా దానికి పేరుండేది. ఎవరైనా ఈ హోటల్ లో భోజనం చేసి బిల్లు చెల్లించేందుకు డబ్బులు లేకుంటే తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని చెబితే చాలు ‘అయితే నీకు ఫ్రీ’ అంటూ చౌదరి భుజం తట్టి మరీ వారిని పంపేవారని ప్రతీతి. సింపుల్ గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అన్నా, పసుపు జెండా అన్నా చౌదరికి పిచ్చి. ఆ పిచ్చి అభిమానంతోనే తన యావదాస్తులను పార్టీకోసమే ధారదత్తం చేశారు. చివరికి కోడి పుంజు హోటల్ కూడా. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు గంగాధర చౌదరి క్లాస్ మేట్. ఓసారి ఆర్థిక మంత్రి హోదాలో రోశయ్య ఖమ్మం వచ్చినపుడు ‘ఏరా చౌదరీ… నీకేం కావాలో అడగరా… అని కోరగా, ‘నాకేమీ వద్దురా’ అని చౌదరి అన్నారంటే ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. వారిద్దరి మధ్య రారా, పోరా తరహలో గల సాన్నిహిత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన చాంబర్ ఆప్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కొప్పు నరేష్ కుమార్ వంటి వారు అప్పట్లో నివ్వెరపోయారు. తన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన అనేక మంది పదవులను అనుభవించి, కోట్లు కూడబెట్టుకోవచ్చు. అవసరార్థం పార్టీలు మారారు. కానీ గంగాధర చౌదరి మాత్రం 86 ఏళ్ల వయస్సులోనూ తెలుగుదేశం పార్టీని వీడలేదు సరికదా.. జెండానూ వదల్లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బలోనూ మహాకూటమి అభ్యర్థుల విజయం కోసం పసుపు జెండాను పట్టుకుని ఖమ్మం వీధుల్లో ఆయన ఓట్లను అభ్యర్థించారు. మొత్తంగా యావత్ ఖమ్మం జనమెరిగిన పొందూరు ఖద్దరు దుస్తుల గంగాధర చౌదరి కాలి నడక దృశ్యం ఇక ఆ వీధుల్లో కనిపించదు. ఆయన ఇక లేరు మరి.
కాగా గంగాధర చౌదరి మృతిపట్ల ప్రముఖ న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన తుదిశ్వాస వరకు కూడా చౌదరి పార్టీ కోసమే తపనపడ్డారని గుర్తు చేశారు.
ఫీచర్డ్ ఇమేజ్: దివంగత ఎన్టీఆర్ తో గంగాధర చౌదరి (ఫైల్ ఫొటో)