అయిష్టత, విరక్తి, నిరాసక్తత, విముఖత. వైరాగ్యానికి గల అర్థాలను బోధించే అనేక పదాలివి. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అన్నారు పెద్దలు. ఒక్కో వైరాగ్యానికి ఒక్కో నిర్వచనం ఉంది. వీటి గురించి క్లుప్తంగా చెప్పాలంటే పురిటి నొప్పుల బాధలు తట్టుకోలేక మహిళలు మళ్లీ ఇంకోసారి ప్రసూతి వార్డుకు రాకూడదని కోరుకుంటుంటారట. అదే విధంగా ఆప్తులను, బంధువులను కోల్పోయి వారి అంత్యక్రియలకు హాజరైన సమయంలో శ్మశాన వైరాగ్యం కలుగుతుందన్నది నానుడి. అబ్బే…ఎంత సంపాదించినా ఏం లాభం? ఈ మట్టిలోనే కదా మనం కలిసిపోయేది? ఈ కట్టెతోపాటే కదా శరీరం కాలిపోయేది? అని భావిస్తూ నిర్వేదపు వ్యాఖ్యలు చేస్తుంటారన్నది శ్మశాన వైరాగ్యపు నిర్వచనం. అక్కడి నుంచి బయటకు వచ్చాక షరా మామూలే. పప్పులో ఉప్పు లేదని, కూరలో కారం తక్కువైందని కట్టుకున్నభార్యపై కేకలు వేస్తుంటారట కొందరు. ఫలానా వ్యాపారంలో ఆశించిన లాభాలు రాలేదని వ్యాపారులు బాధపడుతుంటారట. అక్రమ సంపాదనకు సంబంధించిన అమ్యామ్యాల కోసం అవురావురుమంటూ దేబిరించడం వంటి భిన్నరకాల మనుషుల ప్రవర్తన నుంచి పుట్టిందే శ్మశాన వైరాగ్యం అంటుంటారు.
ఇదిగో ఈ రెండు వైరాగ్యాల గురించి ఇప్పటి వరకు చదివారు కదా? వీటిలోని మంచిని ఆస్వాదిస్తూ ఉంటారు కదా? ఈ వైరాగ్యాల్లోని మంచిని చదవడం పూర్తయ్యాక తిరిగి ఎవరిగోలలో వారు నిమగ్నం కావడాన్నే పురాణ వైరాగ్యం అంటుంటారు. ఇంతకీ అసలు వైరాగ్యం సంగతి చెప్పనేలేదు కదూ?
ఏపీలో మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై తాజాగా చేసిన ‘శ్మశానం’ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చినందుకు బొత్సను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ కూడా చేస్తున్నారు. బొత్సకు ఎంత అహంకారమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర రాజధానికి శ్మశానంలా శత్రువు కూడా పోల్చడని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్మశానంలో కూర్చునే మీరూ, మీ ముఖ్యమంత్రి జగన్ పాలన చేస్తున్నారా? అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అయితే తాను రాజధానిని శ్మశానంతో పోల్చ లేదని, చంద్రబాబు రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కొని రాజధాని అభివృద్ధి చేయకుండా శ్మశానంగా మార్చారని మాత్రమే విమర్శించానని మంత్రి బొత్స వివరణ కూడా ఇచ్చారు. ఇంతకీ అమరావతి శ్మశానమా? రైతుల నుంచి తీసుకున్న భూములు శ్మశానంగా మారాయా? బొత్స వివరణలో క్లారిటీ లేదా? అందుకే ప్రసూతి, శ్మశాన, పురాణ వైరాగ్యాల సరసన ‘అమరావతి వైరాగ్యం’ అనే పదాన్ని కూడా చేర్చాలని బొత్స వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ నేతలు పట్టుబడుతున్నారట.