తెలుగు రాజకీయాల్లో పార్టీ టికెట్ల కేటాయింపు సిత్రాల గురించి తెలిసిందే. కుటుంబ సంస్థలుగా పేరుగాంచిన పార్టీల్లో అయితే వాటి సభ్యులకు ఎటువంటి పరీక్షా లేకుండానే టికెట్లు దక్కుతుంటాయి. ఇందుకు ప్రామాణికం పార్టీ నాయకత్వం కుటుంబ పెద్ద చేతుల్లో ఉండడమే. ఆ మధ్య ఓ తెలుగు మంత్రిగారి తనయుడు ఏకంగా ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సదరు ఈ మంత్రిగారి సుపుత్రున్ని ఓ యూ ట్యూబ్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా అతనికి గల అపారమైన ‘నాలెడ్జ్’ ఏమిటో బట్టబయలైంది. ఇంటర్వ్యూను చూసిన తెలుగు ప్రజలు ఫక్కున నవ్వుకున్నారు. ఇంతటి మేధావిని తాము ఎందుకు గెలిపించలేకపోయామా? అని బహుషా ఆయన పోటీచేసిన నియోజకవర్గ ప్రజలు బాధపడి ఉంటారు. గోదావరి నది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణావైపునకు పారుతుందని మంత్రిగారి తనయుడు బాహాటంగా వెల్లడించడమే ఇందుకు కారణం. తెలుగు రాజకీయాల్లోనే కాదు, ఇంకా ఇతర భాషా రాజీకీయాల్లోనూ ఇటువంటి మేథావులు అదృష్టం కలిసొచ్చి చట్టసభలకు ఎన్నికైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే… అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో నిన్న ఓ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటి వివరాల్లోకి వెడితే…
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటో 2016లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భం నాటిది. తమిళనాట అప్పటి డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని బృందం ప్రస్తుత డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ను ఇంటర్వ్యూ చేసినప్పటి దృశ్యమిది.
ఇప్పుడు ఈ రెండో ఫొటోను చూడండి. ఇది శనివారంనాటి తాజా సీన్. డీఎంకే పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పొలిటికల్ ఔత్సాహికులను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ చిత్రంలో నిలబడి ఉన్నది ఎవరో తెలుసా? డీఎంకే పార్టీ యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి ఉదయనిధి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే కాబోయే తమిళనాడు సీఎం స్టాలిన్ కు స్వయానా కుమారుడు.
స్టాలిన్ కుమారున్ని ఇలా నిలబెట్టి ఇంటర్వ్యూ చేయడమేంటి? అని ఆశ్చర్యపోకండి. డీఎంకే పార్టీలో ఓ సంప్రదాయం ఉంది. ఎన్నికల్లో టికెట్ ఆశించేవారు ఎవరైనా సరే, పార్టీ నిర్వహించే ఇంటర్వ్యూలో పాస్ కావలసిందే. అభ్యర్థికి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉందో లేదోనని పరీక్షిస్తారు. మౌఖిక ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలు సంధిస్తారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని కూడా ఇవే ప్రశ్నలు అడిగారు. చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయనిధి పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు.
తన తండ్రి స్వయానా పార్టీ అధ్యక్షుడైనప్పటికీ ఉదయనిధి ఇంటర్వ్యూను ఫేస్ చేయాల్సి వచ్చింది. ‘నువ్వు టికెట్ ఆశిస్తున్న నియోకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమిటి? విజయావకాశాల మాటేమిటి? గెలిస్తే ఆధిక్యత ఏమేరకు లభించవచ్చు? వంటి అనేక ప్రశ్నలను ఇంటర్వ్యూ టీమ్ ఔత్సాహిక అభ్యర్థిని సంధిస్తుంది. ఇటువంటి అనేక ప్రశ్నలకు ఉదయనిధి సావధానంగా సమాధానమిచ్చారట. కుర్చీలో కూర్చోవాలని పార్టీ నాయకులు కోరినా ఆయన నిలబడే ఇంటర్వ్యూను పూర్తి చేశారట.
విశేషమేమిటంటే ఉదయనిధిని ప్రశ్నించిన సభ్యుల్లో ఒకరైన స్టాలిన్ కూడా గత ఎన్నికల సందర్భంగా ఇదే విధంగా తన తండ్రినుంచి ఇంటర్వ్యూను ఎదుర్కున్నారు. కాకపోతే స్టాలిన్ కూర్చుని సమాధానాలు చెప్పారు, ఉదయనిధి నిలబడి తన ఇంటర్వూలో ప్రశ్నలకు జవాబులు చెప్పారు. ఈ రెండు ఇంటర్వ్యూల్లోనూ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కార్యదర్శి టీఆర్ బాలు ఉండడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న స్టాలిన్ ను కూడా దురైమురుగన్ ఇంటర్వ్యూ చేసి మార్కులు వేశారు. అయితే నిలబడి ఇంటర్వ్యూను ఎదుర్కున్నా, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినా ఉదయనిధికి టికెట్ లభించకపోవచ్చనే వార్తలు వస్తుండడం కొసమెరుపు.