సాధారణ పరిస్థితులు వేరు. అసాధారణ పరిణామాలు వేరు. ఇటువంటి సమయంలోనే, ముఖ్యంగా ఆపత్కాలంలోనే ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వాధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి, తెలంగాణా సీఎం కేసీఆర్ వరకు ఇదే అంశంపై సందర్భానుసారం అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి చెబుతూనే ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం. రోజు రోజుకూ, గంట గంటకూ మారుతున్న పరిస్థితులు. ఇవేవీ ఆ ఎమ్మార్వోకు, డాక్టర్ కు, సబ్ జైలర్ కు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి పట్టినట్లు లేదు. ఖమ్మం జిల్లా మధిర టౌన్ ఎస్ఐ ఉదయ్ కుమార్ కథనం ప్రకారం… గత అర్ధరాత్రి సుమారు 12.30 గంటల ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ఉదయ్ కుమార్ తోపాటు ఇతర పోలీసు సిబ్బందితో కలిసి మధిర రెవెన్యూ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. ఈ సందర్బంగా గెస్ట్ హౌస్ లోపల చెక్ చేయగా, మధిర మండలం మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ దాక్కుని ఉన్నారు.
శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ఇద్దరు పంచుల సమక్షంలో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ తోపాటు మధిర తహశీల్దార్ సైదులు, ఈవోపీఆర్డీ రాజారావు, మధిర సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డిలపై ఐపీసీ 188, 269, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘అనంతర దర్యాప్తులో రెవెన్యూ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) మధుసూదనరావు, మాటూరుపేట వీఆర్వో గంటీ శ్రీను కూడా ఉన్నట్లు తెలిసింది. తదుపరి దర్యాప్తు మేరకు నేరంలో పాల్గొన్న అందరిపైనా చట్ట రీత్యా చర్య తీసుకోబడును.’ అని ఎస్ఐ ఉదయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పోలీసు అధికారి ప్రకటన ప్రకారం క్రైం న్యూస్ రిపోర్టింగ్ శైలి సరే… ఇంతకీ వీళ్లు ఏం చేశారనే సందేహం కలిగింది కదూ? ఎస్ఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఐపీసీ సెక్షన్లను ఉటంకించారేగాని, విషయం రాయలేదు, కానీ ఎమ్మార్వో సైదులు, డాక్టర్ శ్రీనివాస్, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డిలతోపాటు మిగతా ప్రభుత్వ సిబ్బంది చేసిన ఘన కార్యం ఏమిటో తెలుసా? కరోనా లాక్ డౌన్ పరిణామాల్లోనూ మధిర గెస్ట్ హౌస్ ను కేంద్రంగా చేసుకుని సిగ్నేచర్ మందు, చికెన్ వంటకాలతో హ్యాపీగా దావత్ చేసుకున్నారట. సర్కారీ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వాధికారుల తీరుపై ఉప్పందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారట. ఇదీ ప్రచారంలో గల వార్తల అసలు సారాంశం. అదీ సంగతి.