జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ట్రయల్స్ లో ఉన్నారా? రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తున్నారా? ఔననే అంటున్నాయి జర్నలిస్టు వర్గాలు. రాజకీయ రంగంవైపు పీవీ శ్రీనివాస్ సీరియస్ గా దృష్టి సారించినట్లు కూడా ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజా పరిణామాలను కొన్నింటిని పరిశీలించినపుడు ఈ ప్రచారానికి బలం చేకూరుతోందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
పీవీ శ్రీనివాస్ ప్రస్తుతం అధికార పార్టీ నాయకుడికి చెందిన టీ న్యూస్ ఛానల్ ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. గతంలో ఈ న్యూస్ ఛానల్ సీఈవోగా పనిచేసిన ఎం. నారాయణరెడ్డి ఆర్టీఐ కమిషనర్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి టీ న్యూస్ ఛానల్ నిర్వహణ బాధ్యతలను ఇన్ పుట్ ఎడిటర్ హోదాలోనే పీవీ శ్రీనివాస్ చూస్తున్నట్లు సమాచారం.
ఖమ్మం నగరానికి చెందిన పీవీ శ్రీనివాస్ న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రగతి శీల, ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU)లో పనిచేశారు. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. అనంతర పరిణామాల్లో టీవీ9 లో జర్నలిస్టుగా పేరుగాాంచారు. ప్రస్తుతం టీ న్యూస్ లో పనిచేస్తున్నారు.
టీ న్యూస్ లో మంచి హోదాలోనే గల పీవీ శ్రీనివాస్ తాజాగా రాజకీయ రంగం వైపు ఎందుకు చూస్తున్నారు? ఇదీ అసలు ప్రశ్న. ఇందుకూ కారణం ఉందట. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పల్లా రాజేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే మార్చి నెలలో ఆయన పదవీ కాలం ముగుస్తుంది.
వామపక్షాల ప్రాబల్యం గల ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం దృష్టి సారించినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు కోదండరాం పావులు కదుపుతున్నట్లు ఆయా వార్తల సారాంశం. తద్వారా చట్టసభలోకి అడుగిడి సీఎం కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కోదండరాం పూర్వ కాలంలో న్యూ డెమోక్రసీ నాయకుడు కావడం ఈ సందర్భంగా గమనార్హం.
ఇదిగో… ఈ పరిస్థితుల్లోనే కోదండరాం ప్రయత్నానికి చెక్ పెట్టేందుకు జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ ను అధికార పార్టీ రంగంలోకి దింపవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గతంలో పీవీ శ్రీనివాస్ విఫలయత్నం చేసినట్లు కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. కోదండరాంపై పీవీ శ్రీనివాస్ ను రంగంలోకి దించడం ద్వారా వామపక్ష భావజాల పట్టభద్రుల ఓట్ల పోలరైజేషన్ లో తేడా వస్తుందన్నది అధికార పార్టీ వ్యూహంగా చెబుతున్నారు.
అయితే పీవీ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ప్రయత్నానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీవీ శ్రీనివాసును రంగంలోకి దించితే కనీసం జర్నలిస్టు సంఘాలన్నీ మద్ధతు తెలుపుతాయా? అనే అంశాన్ని కూడా అధికార పార్టీ నేతలు లోతుగా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం పీవీ శ్రీనివాస్ ఓ జర్నలిస్టు సంఘానికి నాయకత్వ బాధ్యతల్లో కూడా ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా పీవీ శ్రీనివాస్ సమయానుసారం ఇటీవలి కాలంలో ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటుండడం గమనార్హం. సందర్భంగా వచ్చినప్పుడల్లా ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ స్థానిక జర్నలిస్టులతో సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘సీడ్ గణపతి’ విగ్రహ పంపిణీ కార్యక్రమంలోనూ పీవీ శ్రీనివాస్ పాలు పంచుకోవడం విశేషం. హైదరాబాద్ నుంచి వచ్చి మరీ స్థానికంగా జర్నలిస్టులకు ‘సీడ్ గణపతి’ విగ్రహాలను పీవీ శ్రీనివాస్ పంపిణీ చేశారు.
ఎంపీ సంతోష్ కుమార్ ‘సీడ్ గణపతి’ విగ్రహాల పంపిణీని టీఆర్ఎస్ నాయకులు కూడా ఛాలెంజ్ గా స్వీకరించి పంపిణీ చేసినప్పటికీ, పీవీ శ్రీనివాస్ కూడా రాజధాని నుంచి ఖమ్మానికి వచ్చి విగ్రహాల పంపిణీ చేయడం విశేషం. కాగా పీవీ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ‘ట్రయల్స్’కు ఖమ్మం జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సపోర్ట్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు.