ఖమ్మం కార్పొరేటర్లలో ‘సర్వే’ ప్రకంపనలు
భజన జర్నలిజపు వార్తలు అధికారంలో గల నాయకులకు మహానందాన్ని కలిగించవచ్చు. కానీ భావి నాయకత్వాన్ని తప్పుదోవ పట్టిస్తాయి. వినే చెవులకు శ్రావ్యానందాన్ని, చదివే కళ్లకు నయనానందాన్ని కలిగించే భజన వార్తలు నిజమని ఎవరైనా నాయకుడు విశ్వసిస్తే ఆశించిన ఫలితాలు నిరాశ కలిగించే అవకాశమే ఎక్కువ. అనేక మంది రాజకీయ నాయకుల జీవిత చరిత్ర చెబుతున్న వాస్తవం కూడా ఇదే. అంతెందుకు…? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటి ముందు గుంపులుగా చేరి భజన చేసిన జర్నలిజపు ఆనవాళ్లు ఇప్పుడు కానరావడం లేదెందుకు? పార్లమెంట్ ఎన్నికలకు ముందు వరకు కూడా నిద్ర లేచిందే తడవుగా రాత్రయ్యేవరకు అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం ముందు పడిగాపులుతో భజంత్రీలు వాయించిన ‘జర్నలిజం’ ప్రస్తుతం ఆయన ఇంటి చిరునామా దరిదాపుల్లోనే పెద్దగా కనిపించడం లేదెందుకు? కొందరి అవసరార్థ జర్నలిజపు ఆనవాళ్లకు నిదర్శనం ఆయా సంఘటనలు. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే…?
వాస్తవం చేదుగా ఉంటుంది. నిజం నిష్టూరంగా ఉంటుంది. కానీ నాయకత్వపు నడవడికకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెడితే… ఖమ్మం నగర పాలక సంస్థలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ పరిస్థితిపై మీడియాలో వస్తున్న భజన వార్తా కథనాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, లీకైన సర్వే మాత్రం క్షేత్ర స్థాయిలో అధికార పార్టీకి పొంచిన ప్రమాదస్థితిని ప్రతిబింబిస్తోంది. అనేక డివిజన్లలో కార్పొరేటర్ల పరిస్థితిపై పెదవి విరిచే ఫలితాలే సర్వేలో వెల్లడైనట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామం సహజంగానే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లలో ప్రకంపనలు రేపుతోంది. సర్వే నిర్వహించిన సంస్థకు గల విశ్వసనీయత, నిబద్ధత, చరిత్ర సంగతి ఎలా ఉన్నప్పటికీ, అధికార వర్గాల ద్వారానే ఈ సర్వే చేశారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 62 పేజీల సర్వే నివేదికను నిశితంగా పరిశీలిస్తే అధికార పార్టీ కార్పొరేటర్ల తీరుతెన్నులను బోధపరుస్తోంది.
ఖమ్మం నగర పాలక సంస్థలో మొత్తం యాభై డివిజన్లు ఉండగా, వచ్చే మార్చిలో జరిగే ఎన్నికల్లో 46 డివిజన్లలో అధికార పార్టీ గులాబీ జెండాను ఎగురవేస్తుందనేది ప్రచారంలోకి వచ్చిన వార్తా కథనాల సారాంశం. అంతేకాదు డివిజన్లను పునర్విభజించి 60కి పెంచినా 55 డివిజన్లు ‘కారు’ ఖాతాలో పడతాయని కూడా సర్వేలో తేలినట్లు ఆయా వార్తా కథనాల్లో వడ్డించారు. కానీ ఆయా అంశాలేవీ సర్వే నివేదికలో లేకపోవడమే గమనించాల్సిన అంశం. లీకైన సర్వే నివేదికను నిశితంగా పరిశీలిస్తే… మొత్తం 50 డివిజన్లలో 11 డివిజన్లకు చెందిన కార్పొరేటర్ల పనితీరుపై మాత్రమే ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందులో ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే ‘బెటర్ పర్ఫార్మెన్స్’ను ప్రదర్శించగలిగారు. మొత్తంగా తొమ్మిది మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రమే ‘గుడ్’ అనిపించుకున్నారు. ఈ జాబితాలో 12, 13, 14, 16, 17, 29, 46, 47 డివిజన్లు ఉన్నాయి.
అదేవిధంగా ‘యావరేజ్’ మార్కులు సంపాదించుకున్న 25 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లలో 21 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. ఇకపోతే పనితీరులో ‘అసంతృప్తి’ మార్కులు సంపాదించుకున్న 14 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లలో 12 మంది అధికార పార్టీకి చెందినవారే. డివిజన్లవారీగా 1, 2, 3, 15, 34, 38, 39, 40, 41, 42, 44, 45కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు (ఇందులో పార్టీ మారిన వారు కూడా కొందరు ఉన్నారు) ‘బ్యాడ్ ఇమేజ్’ను సొంతం చేసుకున్నారని సర్వే నివేదిక చెబుతోంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు అధికార పార్టీకి చెందిన 33 మంది కార్పొరేటర్ల పనితీరు బాహాటంగానే ప్రస్ఫుటమవుతోంది. ఇందులో 12 మంది ‘బ్యాడ్ ఇమేజ్’ను కలిగి ఉండగా, మిగతా 21 మంది ‘యావరేజ్’ ఇమేజ్ మాత్రమే కలిగి ఉన్నారు. కేవలం 9 మంది కార్పొరేటర్ల పనితీరుకు మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణలో ‘గుడ్’ మార్కులు పడ్డాయి. ఇందులో కేవలం ముగ్గురంటే ముగ్గురు కార్పొరేటర్లే ‘బెటర్ ఫర్ఫార్మెన్స్’ కలిగి ఉన్నారు.
మొత్తగా కార్పొరేటర్ల పనితీరుపై 26.16 శాతం మాత్రమే ప్రజలు ‘గుడ్’ అన్నారు. మరో 42.05 శాతం మంది ‘యావరేజ్’గా అభిప్రాయపడ్డారు. మరో 31.79 శాతం మంది ‘పూర్’ అంటూ తమ భావాలను సర్వేలో పంచుకున్నారు. అంతేకాదు 13 డివిజన్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల ‘వ్యవహార తీరు’ను కూడా సర్వే నివేదికలో ప్రస్తావించారు. ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు, దురుసు ప్రవర్తన వంటి అంశాల కారణంగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయారని స్పష్టంగా పేర్కొన్నారు. నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు వద్ద నిర్మిస్తున్న కొత్త బస్ స్టేషన్, ఇల్లందు క్రాస్ రోడ్ లో నిర్మిస్తున్న ఐటీ హబ్, గోళ్లపాడు భూగర్భ డ్రైనేజీ నిర్మాణపు పనుల త్వరితగతిన పూర్తి చేసే అంశాలను కూడా సర్వే నివేదికలో ఉటంకించారు. ఇవీ లీకైన సర్వే నివేదిక చెబుతున్న అసలు లెక్కలు. కానీ ‘ఏ పార్టీకి ఓటేస్తారు?’ అనే ప్రశ్నకు విచిత్రంగా 51.33 శాతం ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పడమే అసలు విశేషం.
సరే… కార్పొరేటర్ల పనితీరు బాగోలేదు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ ను చూసి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని కాసేపు భావించినా, ప్రస్తుత కార్పొరేటర్లలో ఎంతమందికి మళ్లీ టికెట్లు లభిస్తాయనే సందేహాన్ని కూడా సర్వే నివేదిక ఫలితాలు కలిగిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో జరగాల్సిన ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ సరికొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతుందా? అదే జరిగితే కనీసం 25 మంది కార్పొరేటర్లకు మళ్లీ టికెట్ దక్కే అవకాశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లీకైన సర్వే నివేదిక కలిగిస్తున్న అనుమానాలు కూడా ఇవేనంటున్నారు. మొత్తంగా 62 పేజీల సర్వే నివేదిక ఖమ్మం నగరంలోని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లలో తీవ్ర గుబులు కలిగిస్తోంది.