భోగముని సురేష్.. ఇప్పుడీ పేరు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై, ఇతర అధికారులపై రైతులు దాడి చేసిన ఘటనకు సూత్రధారిగా సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ సైతం సురేష్ పేరును సూత్రధారిగా వెల్లడించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ను నమ్మించి గ్రామానికి తీసుకువెళ్లింది సురేషేనని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఐజీ మీడియాతో మాట్లాడుతూ, ఉద్ధేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగిందని చెప్పారు. భోగముని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ ను నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ పై ఇతర అధికారులపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడిలో సుమారు 100 మందికి పైగా వ్యక్తులు ఉన్నారని, ఘటనపై విచారణ చేస్తున్నామని, దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడికి పాల్పడిన సురేష్, అతని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకుంటామని, ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నామని ఐజీ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇంతకీ ఎవరీ సురేష్? ఏకంగా ఐఏఎస్ అధికారిపైనే దాడికి పాల్పడడం వెనుక గల బరితెగింపునకు గల కారణాలేమిటి? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా రేకెత్తుతున్నాయి. సురేష్ బీఆర్ఎస్ నాయకుడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్ లోని ఎన్ హెచ్-163పై అధికార పార్టీ నాయకులు బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, సురేష్ ను బీఆర్ఎస్ లీడర్ గా వెల్లడించారు. కేటీఆర్ కావాలనే ఈ దాడి చేయించారని, సురేష్ ముందుండి నడిపించారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా సురేష్ బీఆర్ఎస్ నాయకుడని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతుండడం గమనార్హం. కలెక్టర్ పై దాడి వెనుక ఓ పార్టీ నాయకుల హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొన్ని ప్రముఖ పత్రికలు కూడా వార్తా కథనాలను వెలువరించడం ప్రస్తావనాంశం.