కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం అంశంలో ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతను రాజకుటుంబానికే అప్పగిస్తూ సోమవారం తీర్పు వెలువడింది.
అనంత పద్మనాభ స్వామి దేవాలయ నేలమాలిగలోని ఆరో గదిలో ఏముంది? ఆరో గది తలుపులు తెరవాలని కొందరు, తెరవొద్దని మరికొందరు కొన్నేళ్లుగా వాదిస్తున్నారు. ఇటువంటి అనేక పరిణామాల మధ్య మొత్తంగా వివాదం సుప్రీంకోర్టు వరకు చేరింది. 2011 నుండి సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్న కేసు తుది తీర్పుపై సహజంగానే ఆసక్తి ఏర్పడింది. అత్యంత ధనిక ఆలయంగా వార్తల్లోకెక్కిన అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో రోజు రోజుకీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మైసూరు రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంతభాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారని వార్తలు వచ్చాయి.
ఆరో నేలమాళిగకు, సముద్రానికి లింక్ ఉందని, ఆరో నేర మాళిగను తెరిస్తే అరిష్టంతో పాటు ప్రళయం కూడా సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇదే తరహాలో కోనేటిలోని నిధులపై చెయ్యేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సముద్రం ముంచెత్తి సర్వనాశనం చేస్తుందని ప్రచారం జరిగింది.
ఆలయం, ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు అడుగుభాగంలో రహస్య మార్గాలున్నాయని, నిధులు దాచిన గదుల్లోకి అవి తెరుచుకున్నాయని ఒకవేళ ఆ గదులను తెరిస్తే సముద్ర నీరు ఆ మార్గాల ద్వారా చొచ్చుకువచ్చి ముంచేస్తుందని ఆసక్తి కర కథనాలు వెలువడ్డాయి.
ఇప్పటికే సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఐదు గదులను తెరిచి అందులోని సంపదను లెక్కించారు. కానీ అదంతా సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణలో, సుప్రీం ఆదేశాల ప్రకారం జరిగింది. అయితే ఆ సంపద వెలుగు చూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం సంభవించింది, మరొక సభ్యునికి కాలు విరిగింది. అది కాకతాళీయమా కాదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఐదు గదులను తెరిచిన తరువాత ఆరోగదిని కూడా తెరవాలనుకున్నారు. అయితే, ఆ గది తలుపులపై నాగు పాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు.
ఈలోగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో మరో కమిటీ వేసి ఆస్తుల గుర్తింపు, భద్రపరిచే చర్యల పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు ఆరోగది విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది సుప్రీం కోర్టు.
మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపుతున్నదని స్థానికులు చెబ్తున్నారు. ఇందుకు పరాకాష్టగా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ కూడా కన్నుమూశారని కొందరి వాదన. ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉన్నదన్నది స్థానికుల్లో కొందరి ప్రగాఢ విశ్వాసం.
ఈ నేపథ్యంలోనే అనంత పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టు వరకు చేరింది. వాద, ప్రతివాదనల అనంతరం ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది.