అసలుకన్నా…వడ్డీ భారం అంటుంటారు కదా? సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం కొన్ని టెలికాం వ్యాపార సంస్థలు అసలు మీద… అక్షరాలా 41,650 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి దేశంలోని వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అంతేకాదు… జరిగిన జాప్యానికి ఫైన్ కింద మరో రూ. 10,923 కోట్ల మొత్తాన్ని చెల్లించక తప్పని పరిస్థితి. ఈ ఫైన్ మొత్తంపై మళ్లీ వడ్డీ రూ. 16,878 కోట్లు మాత్రమే. మొత్తంగా చెల్లించాల్సిన డబ్బు రూ. 92,640 కోట్లు. ఇంతకీ చెల్లించాల్సిన అసలు మొత్తం ఎంతో చెప్పలేదు కదూ? రూ. 23,189 కోట్లు మాత్రమే.
ఏజీఆర్ ఛార్జీలుగా వ్యవహరించే స్పెక్ట్రం యూజర్ ఛార్జీలు, లైసెన్సు ఫీజుల కింద కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాలపై టెలికాం కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయట. ఏజీఆర్ ఛార్జీల కింద వివిధ టెలికాం కంపెనీలు రూ. 92 వేల కోట్ల మొత్తాన్ని చెల్లించాలని గత అక్టోబర్ లో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుపై బ్రిటన్ కు చెందిన వోడా ఫోన్ వంటి కంపెనీలు ఆవేదన చెందుతున్నాయట. జియో సంస్థతో తీవ్ర పోటీని చవి చూస్తున్న వివిధ టెలికాం కంపెనీలు ఏజీఆర్ ఛార్జీలు, వడ్డీతో సహా తేలిన మొత్తపు లెక్కలు చూసి గుడ్లు తేలేస్తున్నాయట. ఏజీఆర్ ఛార్జీల అంశంలో టెలికాం కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య 2005లో ప్రారంభమైన కేసు వాస్తవానికి 2015లోనే కొలిక్కి వచ్చింది. కానీ టెలికాం సంస్థలకు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. వాద, ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి అనుకూలంగా వచ్చింది. ఏజీఆర్ ఛార్జీల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలన్నది తీర్పు సారాంశం. తాజా తీర్పుపై ఇక అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా టెలికాం కంపెనీలకు లేదని తీర్పులోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా కంపెనీల వారీగా ఎయిర్ టెల్ రూ. 21,683 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823 కోట్లు, రిలయన్స్ కమ్యునికేషన్స్ రూ. 16,456 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ. 2,537 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. మొత్తం సారాంశంలో కొసమెరుపు ఏమిటంటే…టెలికాం రంగంలోని వివిధ సంస్థలు ఇప్పటికే రూ. 4.00 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయట. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరో రూ. 92 వేల కోట్ల భారం. లాభం గూబలోకి అంటే ఇదే కాబోలు.