సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. సినిమా యూనిట్ లోని కొందరికి కరోనా సోకిన నేపథ్యంలో సినిమా షూటింగ్ నిలిపేశారు.
ఆ తర్వాత ఈనెల 22న రజనీకాంత్ కు నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆయనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో స్వీయ క్వారంటైన్ లో గల రజనీకాంత్ అకస్మాత్తుగా జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
అయితే బీపీకి సంబంధించి హెచ్చు, తగ్గుల కారణంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. బీపీని కంట్రోల్ చేయడానికి చికిత్స చేస్తున్నామని, కంట్రోల్ కాగానే ఆయనను డిశ్చార్జి చేస్తామని జూబ్లీ హిల్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇంతకు మించి ఆయనకు మరే ఇతర ఇబ్బందులు లేవని కూడా వెల్లడించారు.