అభిమానులను ఎడా పెడా వాయించే కొందరు సినీ హీరోలను చూశాం. అభిమానంతో తమను ముట్టుకున్నందుకే కొందరు హీరోల ఓవర్ యాక్షన్ పై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇంకొందరైతే అభిమానులు తమను తాకితే మైల పడినట్లు ఫినాయిల్ తో కడిగేసుకుంటారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేశారో తెలుసా? ఏ సంకోచమూ లేకుండా తనను ఆరాధించే అభిమాని కాలు పట్టుకున్నారు. కాలు పట్టుకోవడమంటే ఏదో తప్పు చేసినందుకు కాదు. ఆ అభిమానికి చేతులు లేవు. అందుకే కాలు పట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…
కేరళలోని పగఘాట్ ప్రాంతంలో ప్రణవ్ అనే దివ్యాంగుడు ఉన్నాడు. అతనికి చేతులు లేవు. కాళ్లతోనే తాను చేసుకోగలిగే పనులన్నీచేసుకుంటాడు. తన అభిమాన హీరో తలైవాను కలవాలని ప్రణవ్ చిరకాల కోరిక. రజనీకాంత్ ను కలవాలని ఆయన అభిమానులు ఎవరుకోరు మరి. కానీ అందరి ఆశలు తీరవు కదా? కానీ ప్రణవ్ కోరిక ఫలించే రోజు రానే వచ్చింది. రజనీకాంత్ నుంచి ప్రణవ్ కు పిలుపు అందింది. ప్రణవ్ ను రజనీకాంత్ స్వయంగా పోయెస్ గార్డెన్ లోని తన నివాసానికి ఆహ్వానించారు. చెన్నయ్ రావడానికి కేరళ నుంచి రైలు టికెట్ కూడా రజనీయే బుక్ చేయించారు. తన ఇంటికి వచ్చిన అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రజనీ సన్నద్ధమయ్యారు. కానీ ప్రణవ్ కు చేతులు లేవు కదా? అయినా రజనీ వెనుకంజ వేయలేదు. ప్రణవ్ కాలుకే షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇరవై ఒక్క ఏళ్ల ప్రణవ్ మంచి ఆర్టిస్టు కూడా. తన అభిమాన హీరో రజనీ బొమ్మను తన కాళ్లతోనే గీశాడు. దాన్ని రజనీకాంత్ కు బహుకరించాడు. తాను గీసిన బొమ్మలతో వచ్చిన మొత్తాన్ని ప్రణవ్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ ను కలసి ఆయనతో ప్రణవ్ సెల్ఫీ కూడా దిగారు. ఇప్పుడు ప్రణవ్ పేరు మీడియాలో మార్మోగుతోంది. మరోవైపు ప్రణవ్ కాలు పట్టుకున్న రజనీకాంత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.