రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు కొందరు గ్రామస్తులను, ఇల్లంతకుంట ఎస్ఐని ఉటంకిస్తూ చేసిన ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ప్రస్తుత స్థితికి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, ఇల్లంతకుంట ఎస్ఐ కారణమని బాధితుడు తన ప్రాణాలు కోల్పోవడానికి కొద్ది గంటల ముందు జడ్జి ఎదుట మరణ వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా తెలుస్తున్న సమాచారం ధ్రువపడాల్సి ఉంది.
అందిన సమాచారం ప్రకారం… ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటకు చెందిన రెబ్బల వంశీ అనే యువకుడు ఓ వ్యక్తికి చెందిన వరికట్టల మిషన్ ను నడిపేవాడు. అయితే ఇటీవల ఈ మిషన్ ను దాని యజమాని నడపగా, ప్రమాదవశాత్తు వంశీ మీదనుంచి వెళ్లడంతో అతని చెయ్యి ధ్వంసమైంది. ఇందుకు సంబంధించి బాధితుడు వంశీ ఇల్లంతకుంట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికుల కథనం.
ఈ నేపథ్యంలోనే జరిగిన ‘పంచాయతీ’లో వరికట్టల మిషన్ యజమాని బాధితునికి నష్ట పరిహారంగా రూ. 10.00 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందంటున్నారు. కానీ ఆ తర్వాత జరగినట్లు పేర్కొంటున్న నాటకీయ పరిణామాల్లో వంశీకి మిషన్ యజమాని ఎటువంటి డబ్బు చెల్లించకపోగా, వంశీకి బెదిరింపులు ఎదురయ్యాయనే కథనం ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీ పురుగుల మందు తాగి నిన్న ఆత్మహత్యకు పాల్పడగా, ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటలకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
పురుగు మందు తాగిన ఘటన తర్వాత వంశీని చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, ఇక్కడే న్యాయమూర్తి ఒకరికి బాధితుడు మరణ వాంగ్మలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాంగ్మూలంలో తనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు న్యాయమూర్తికి వివరించినట్లు సమాచారం. మొత్తం ఘటనలో రహీంఖాన్ పేటకు చెందిన కొందరి పేర్లను, ఇల్లంతకుంట ఎస్ఐని కూడా బాధితుడు వంశీ ఉటంకించడం కలకలానికి దారి తీసింది. వంశీ మరణానంతరం రహీంఖాన్ పేటలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కాగా తాము ఎటువంటి కేసు నమోదు చేయలేదని, ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ స్థానిక మీడియా వర్గాలతో చెప్పారు.