‘సుడా’… అంటే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట. మహానగరాలైన హైదరాబాద్ ‘హుడా’, వరంగల్ ‘కుడా’ టైపు సంస్థ. ఖమ్మం నగరాభివృద్ధికోసం 2017లో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. సంస్థ ఏర్పాటైన చాలా రోజుల తర్వాత ‘సుడా’కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ‘సుడా’తొలి చైర్మన్ గా బచ్చు విజయకుమార్ ను ప్రభుత్వం నియమించింది.
తాతల కాలం నుంచి రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన విజయకుమార్ కు సైతం రెండు దశాబ్దాలుగా రాజకీయ రంగంతో అనుబంధం ఉంది. ‘బచ్చు’ కుటుంబంలో రాజకీయంగా పదవి వరించిన తొలి వ్యక్తి విజయకుమార్ కావడం మరో విశేషం. తొలుత ఖమ్మం మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్ వద్ద గల విజయ్ కుమార్ 2014 నుంచి ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫాలోవర్ గా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ కుమార్ ను ‘సుడా’ చైర్మెన్ పదవి వరించింది. మరికొద్ది సేపట్లో ఆయనతోపాటు పాలక మండలి సభ్యులు కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘సుడా’ తొలి చైర్మెన్ విజయ్ కుమార్ కు, కమిటీ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, వ్యాపార వర్గాలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఖమ్మం నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతే కాదు పత్రికల్లో పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు కూడా ఇచ్చారు.
పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సంబురాన్ని అంబురం తాకే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ గురువారం రాత్రి అకస్మాత్తుగా వీచిన భారీ ఈదురు గాలులకు, వర్షానికి ఫ్లెక్సీలన్నీ ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఫ్లెక్సీలను నగర పాలక సంస్థ సిబ్బంది తొలగించారు. ఇక్కడ మీరు చూస్తున్న ధ్వంసమైన ఫ్లెక్సీల దృశ్యాలు గాలివాన ‘విధ్వంసపు’ బాపతే.