కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండగా, పశువులకు సోకుతున్న ఓ వింత వ్యాధి రైతులను తీవ్రంగా కలవరపరుస్తోంది. తెలంగాణాలోని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గూర్రేవులలో పశు సంపదను వింత వ్యాధి పట్టి పీడిస్తోంది. సుమారు పది రోజులుగా అనేక పశువులు ఇటువంటి వింత వ్యాధితో కనిపిస్తుండడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కుడి వైపు కాలు ఎగువ భాగాన కణితిగా ఏర్పడి పగులుతోందని, ఓ పెద్ద చెంబుడు రసం లాంటి పదార్థం బయటకు వచ్చి భరించలేని దుర్వాసన వస్తోందని రైతులు చెబుతున్నారు.
మండలంలోని అనేక గ్రామాల్లో గల పశు సంపదను ఈ వింత వ్యాధి పట్టి పీడిస్తోందంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ ఇటువంటి వింత వ్యాధి పశువులకు సోకిన ఘటనలు లేవని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వ్యాధి ఏమిటో నిర్ధారణ చేసి చెప్పడానికి స్థానికంగా పశు వైద్యులు సైతం లేరని, రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కన్నాయిగూడెం జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంటనే ఈ విషయంలో స్పందించాలని, పశు వైద్యులను కన్నాయిగూడెం మండలానికి పంపి పశు సంపదకు సోకిన వింత వ్యాధి నివారణకు చర్యలకై ఆదేశించాలని ఆయన కోరారు.