‘ఎవరు రావాలన్నా కూడా… అది ఎమ్మెల్సీ కావచ్చు. ఎంపీ కావచ్చు. జిల్లా పరిషత్ చైర్మెన్ కావచ్చు. మంత్రి కావచ్చు…ఎవరైనా కూడా ఎమ్మెల్యేగారి కనుసైగల్లో… ఎమ్మెల్యేగారి ఆహ్వానం మేరకు మాత్రమే నియోజకవర్గానికి రావాలి. అట్ల గాకుండా ఎవరొచ్చినా కూడా గ్రూపు రాజకీయాలను పోషించినట్టే అవుద్ది. తస్మాత్ జాగ్రత్త..’ అంటూ తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాజయ్య చేసిన ఆయా వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపాయి. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇటీవలి కాలంలో ఘన్పూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, లాక్ డౌన్ పరిణామాల్లో వివిధ వర్గాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టిన నేపథ్యంలో రాజయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.

తన వ్యాఖ్యల్లో రాజయ్య ఎక్కడా కడియం శ్రీహరి పేరును ఉచ్ఛరించకపోయినా తాజా ఘటనల నేపథ్యం ఇందుకు ఆస్కారం కలిగించినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తన కూతురు కడియం కావ్య రాజకీయ భవిత లక్ష్యంగా శ్రీహరి వేస్తున్న అడుగులు రాజయ్య వ్యాఖ్యల ఆగ్రహానికి కారణంగా అంచనా వేస్తున్నారు. తాటికొండ రాజయ్య చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version