తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐదుగురు భక్తులు దుర్మరణం చెందగా, మరో యాభై మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు చికత్స కోసం తరలించారు.
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పెను విషాదానికి కారణమైంది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజని (47), లావణ్య (40) శాంతి (34), కర్నాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50)గా గుర్తించారు.
వైకుంఠ ద్వారా ఏకాదశి సందర్భంగా తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1.20 లక్షల టికెట్లను భక్తుల కోసం జారీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచేగాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం,అలిపిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది.
వివిధ ప్రాంతాల్లో స్వల్ప తొక్కిసలాట ఘటనలు అదుపులోకి వచ్చాయని భావిస్తున్న పరిణామాల్లోనే బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూలు వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో శ్రీపద్మావతి పార్కులోని ఓ వ్యక్తి అస్వస్థతకు గురి కాగా, వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరిచే ప్రయత్నం చేశారు. అయితే క్యూ లైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన భక్తులు కొందరు ఒక్కసారిగా బలంగా తోసుకుని ముందుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
దీంతో అనేక మంది భక్తులు కింద పడిపోయారు. ఊపిరాడని పరిస్థితుల్లో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా, వారికి రుయా, స్విమ్స్ అసుపత్రులకు తరలిస్తుండగానే అక్కడికి చేరుకునే వరకే నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బైరాగిపట్టెడ వద్ద జరిగిన ఘటనలోనే ఐదుగురు భక్తులు మరణించారు. మరోవైపు శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ల కేంద్రం వద్ద తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (50) అనే మహిళ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.