అది IAS వంటి ఉన్నతాధికారులు ఉండే కార్యాలయం. తెలంగాణా వ్యాప్తంగా దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. సుమారు పదకొండు లక్షల మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకై ఆలోచించే విషయం. ఇలాంటి సమయంలో అసమగ్ర సర్క్యూలర్ విడుదల కావడం విద్యావంతులను, విద్యా సంస్థల నిర్వాహకులను విస్మయానికి గురి చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 23 నుండి 30వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యా శాఖ ఓ సర్క్యూలర్ కూడా విడుదల చేసింది.
21న జరిగే హిందీ పరీక్ష యథాతథం, 23 నుండి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలు వాయిదా అనేది సర్క్యులర్ సారాంశం. కానీ ఈనెల 31న, ఏప్రిల్ 1న జరిగే సోషల్ (సాంఘిక శాస్త్రం) పరీక్ష గురించి ఏ ప్రస్తావన లేకుండా విడుదల చేయడమే ఆ సర్క్యూలర్ అసమగ్ర సారాంశం. మార్చి 31 నుంచి జరిగే పరీక్షలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ అంశాన్ని సర్క్యులర్ లో ఉటంకించకుండా, విషయాన్ని అస్పష్టంగా చెబుతూ జారీ చేసిన ఉత్తర్వు సారాంశంపై విద్యార్థులు, విద్యా సంస్థల నిర్వాహకులు డోలాయమాన స్థితిని ఎదుర్కుంటున్నారు. ఇదీ విద్యాశాఖకు చెందిన మన ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్య నిర్వాకం.
✍ తుమ్మలపల్లి ప్రసాద్