ఈ విద్యా సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షల కోసం ప్రశ్నా పత్రాలను తయారు చేయడం లేదు. 2019 పబ్లిక్ పరీక్షల కోసం తయారు చేసిన రెండు రకాల ప్రశ్నా పత్రాల్లోని సెకండ్ సెట్ ప్రశ్నా పత్రాలనే ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జరిగే ‘ప్రీ ఫైనల్’ పరీక్షల కోసం ఉపయోగించాలనే ఆదేశాలను విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు. గత సంవత్సరం వరకు ప్రీ ఫైనల్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రశ్నా పత్రాలను తయారు చేసి పాఠశాలలకు అందజేశారు. దీనికి ముందు సెకండ్ సెట్ ప్రశ్నా పత్రాలతో కూడా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చే వారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే నష్టం:
గతంలో క్వార్టర్లీ , ఆఫ్ ఇయర్లీ , సెకండ్ సెట్ పేపర్స్, ప్రీ ఫైనల్ పేపర్స్ ఇలా నాలుగు రకాల ప్రశ్నా పత్రాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చే వారు. క్వార్టర్లీ పరీక్షల తర్వాత ఇంత వరకు పబ్లిక్ పరీక్షల తరహాలో ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదు. ప్రభుత్వ విద్యా శాఖ ఒక్కో సంవత్సరం ఒక్కోటి రద్దు చేసుకుంటూ వచ్చి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నదని పలువురు విద్యా రంగ నిపుణులు వాపోతున్నారు.
ప్రైవేటు లో ప్రైవేటు పేపర్స్ తో…
జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు ప్రశ్నా పత్రాల పంపిణీ జరుగుతుంది. DCEB ప్రశ్నా పత్రాల తయారీలో చేతులెత్తేయడంతో, ప్రైవేట్ వారు తమ దారి తాము చూసుకున్నారు.
మార్చి నెలలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం రకరకాల పరీక్షలతో తర్ఫీదు ఇవ్వడం అవసరం. ప్రభుత్వం తమ పిల్లలు డైరెక్ట్ గా పబ్లిక్ పరీక్షలకు వెళ్లే విధంగా ఒక్కో పరీక్షను రద్దు చేసుకుంటూ రాగా, ప్రైవేటు పాఠశాలల వారు మాత్రం తమ పిల్లల కోసం రకరకాల ప్రైవేట్ ప్రశ్నా పత్రాలతో పరీక్షలు పెట్టుకుంటూ శిక్షణ ఇస్తున్నారు.
ప్రభుత్వం తమ వారి కోసం తమ చేతిలో ఉన్న పనినే చేయకుండా, ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోయి, ఇక విద్యార్థుల బాగు కోసం ఏమి చేస్తారనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.
మొత్తంగా చెప్పేదేమిటంటే… నాడు అన్ని తరగతులకు ఆఫ్ ఇయర్లీ బంద్ బాటలోనే నేడు టెన్త్ ప్రీ ఫైనల్….! అదన్న మాట సంగతి.
✍ తుమ్మలపల్లి ప్రసాద్