సృజన్ రెడ్డి…నిన్న ప్రముఖంగా వార్తల్లోకి వచ్చిన పేరు ఇది.. ఇతన్ని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది (తెలంగాణా మాండలికంలో బామ్మర్దిగా వ్యవహరిస్తుంటారు)గా ఉటంకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండరల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్ తోపాటు మరో రెండు సంస్థలకు కట్టబెట్టడంలో తతంగం నడిచిందనేది కేటీఆర్ ఆరోపణ. అంతేకాదు ఈ విషయంలో తాము కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు లేఖ రాశామని, కేంద్రం నిష్పక్షపాతగా విచారణ జరిపితే రేవంత్ రెడ్డి పదవిని కోల్పోతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ఆరోపణలపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ఆరోపణలు పచ్చి అబద్దాలుగా కొట్టిపారేశారు. మొత్తం టెండర్లలో రూ. 8,888 కోట్ల అంకె ఎక్కడిదని కూడా మంత్రి ప్రశ్నించారు. ఇదే సందర్భంగా ఆరోపణలు నిరూపించాలని పొంగులేటి రాజీనామ అస్త్రాన్ని సంధించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. కేటీఆర్ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి సృజన్ రెడ్డి పేరును కూడా పదే పదే ప్రస్తావించారు. అసలు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిదేంటి? తనపై పాలేరులో పోటీచేసి ఓడిపోయిన కందాళ ఉపేందర్ రెడ్డి అల్లుడే సృజన్ రెడ్డి అని పొంగులేటి చెప్పారు. ఉపేందర్ రెడ్డి నిత్యం కేటీఆర్ వెంటే కలిసి తిరుగుతారని చెప్పారు. సృజన్ రెడ్డి ముమ్మాటికీ కేటీఆర్ మనిషేనని, 2015లో పాలమూరు-రంగారెడ్డి ఏడో ప్యాకేజీలో రూ. 1,150 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లినందుకే ఆ పనులు అప్పగించారనేది నిజమని కూడా పొంగులేటి ఆరోపించారు. ఉపేందర్ రెడ్డి అల్లుడైన సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిది అంటూ కేటీఆర్ రంగేస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.
అటు కేటీఆర్, ఇటు మంత్రి పొంగులేటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజీనామా సవాళ్ల అంశం సంగతి ఎలా ఉన్నప్పటికీ, మొత్తం ఎపిసోడ్ లో సృజన్ రెడ్డి ప్రముఖంగా వార్తల్లోకి రావడం గమనార్హం. టెండర్ల వ్యవహారంలో సృజన్ రెడ్డి పేరును, కంపెనీ పేరును ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆరోపణలు చేయడం, సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బావ మరిది ఏమిటంటూ పొంగులేటి నిలదీయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశంలో రేవంత్ రెడ్డి చట్టప్రకారం పదవీచ్యుతుడవుతారంటూ కేటీఆర్ ప్రస్తావించిన వ్యక్తే ప్రధానంగా వార్తల్లో నిలిచారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సృజన్ రెడ్డి ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దేనా? కాదా? అనే చర్చ కూడా సాగుతోంది.
నిజానికి సూదిని సృజన్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చిన్నల్లుడే. రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేని సృజన్ రెడ్డి వ్యాపకం యావత్తూ వ్యాపారంగానే ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. అంతెందుకు ఉపేందర్ రెడ్డి అల్లుడే అయినప్పటికీ, తన మామ ప్రాతినిధ్యం వహించిన పాలేరు ఎన్నికల ప్రచారంలో ఆయన పెద్దగా కనిపించలేదు. ఉపేందర్ రెడ్డి చిన్నల్లుడైన సృజన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ధిగా కేటీఆర్ సంబోధించడంలో నిజమెంత? అనే చర్చ కూడా జరుగుతోంది.
ts29.in సేకరించిన సమాచారం ప్రకారం.. వాస్తవానికి సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సొంత బామ్మర్ది కాదు. దివంగత మాజీ ఎంపీ సూదిని జైపాల్ రెడ్డి తమ్ముళ్లలో ఓ తమ్ముని కుమారుడే సూదిని సృజన్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి భార్య గీత సోదరుని పేరు జయప్రకాష్ రెడ్డి. సీఎం సొంత మామ పేరు పద్మాకర్ రెడ్డి కాగా, సృజన్ రెడ్డి తండ్రి పేరు మనోహర్ రెడ్డిగా తెలుస్తోంది. జైపాల్ రెడ్డి సోదరులే పద్మాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు. తెలంగాణా వ్యవహారికం ప్రకారం సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సొంత బామ్మర్ది కాదన్నమాట. బంధుత్వం ప్రకారం మాత్రమే బామ్మర్ది అవుతారనేది సుస్పష్టం. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి కేటీఆర్ సృజన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దిగా ఉటంకించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టోటల్ ఎపిసోడ్ లో శోధ కన్స్ట్రక్షన్స్ కంపెనీ డైరెక్టర్లలో కందాళ దీప్తిరెడ్డి పేరు ఉండగా, వార్తల్లో ప్రముఖంగా వచ్చిన సృజన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు. సృజన్ రెడ్డి సతీమణే దీప్తిరెడ్డి, ఈమె కందాళ ఉపేందర్ రెడ్డి చిన్న కూతురు కావడం గమనార్హం.