ఫొటో చూశారుగా…? చెమర్చిన కళ్లను తుడుచుకుంటున్న ఆయన పేరు శ్రీనివాస్ గుప్తా. కర్నాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య దూరమైన దుఃఖాన్ని కడుపులోనే దిగమింగుకుంటున్న గుప్తా ఇటీవలే కొత్తగా ఓ ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశం చేయాలి… కానీ సతీమణి లేకుండా ఎలా? తన భార్య లేని లోటు కనిపించకూడదు.
అందుకే తన గుండెనిండా దాచుకున్న భార్య రూపాన్ని కళ్ల ముందే కనిపించేలా వినూత్న ఆలోచన చేశారు. ఆలోచన కార్యరూపం దాల్చేవిధంగా ఉపక్రమించారు. అందులో భాగంగానే తన భార్య నిలువెత్తు విగ్రహాన్ని మైనంతో చేయించారు. ఆ విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ఇంట్లో వివిధ ప్రాంతాల్లోకి మారుస్తూ తన భార్య లేని లోటు తెలియనివ్వకుండా తన గుండెల్లోని ప్రేమను ఇలా చాటుకున్నారు.
భార్య బతికుండగానే వివిధ రూపాల్లో ఆమెకు ప్రత్యక్ష నరకం చూపే శాడిస్టు భర్తలున్న ఈ ధూర్త లోకంలో శ్రీనివాస్ గుప్తా ఆలోచనకు బంధువర్గం ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన భార్య మైనపు బొమ్మతో ఫొటోలు దిగి మరీ మురిసిపోయారు కూడా. అందుకే శ్రీనివాస్ గుప్తా భార్య మైనపు బొమ్మ ఇప్పుడు జాతీయ స్థాయిలో వార్తాంశంగా మారింది. మీరు చూస్తున్న ఫొటోలు శ్రీనివాస్ గుప్తా గృహప్రవేశం సందర్భంగా తీసిన దృశ్యాలే.