ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. బాలు పార్థీవ దేహానికి అంతిమ సంస్కారాలను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సహా కుటుంబ సభ్యులు నిర్వహించారు. చెన్నయ్ లోని తామరైపాక్కం ఫాం హౌజ్ లో బాలు పార్థీవ దేహానికి ఖననం (పూడ్చిపెట్టడం) పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించడం గమనార్హం. హిందూ సంప్రదాయ కుటుంబాల్లో తనువు చాలించిన వివాహితులైన వారి అంత్యక్రియలను దహనం (కాల్చడం) పద్ధతిలో నిర్వహించడం చూస్తుంటాం. అవివాహితులకు మాత్రమే ఖననం రీతిలో (పూడ్చిపెట్టడం) అంతిమ సంస్కారాలు చేస్తారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పక్కా హిందువులు. సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. ఇందులో ఏ సందేహం లేదు. కానీ ఆయన పార్థీవ దేహాన్ని అంత్యక్రియల నిర్వహణలో ఖననం చేయడం గమనించాల్సిన అంశం. ఆయా దృశ్యాలను టీవీల్లో చూశాక, బాలసుబ్రహ్మణ్యం దేహానికి ఖననం చేశారేమిటనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే శైవ బ్రాహ్మణులను ‘లింగధారులు’గానూ వ్యవహరిస్తారని, వారి ఆచార, సంప్రదాయాల్లో వివాహితులైనా, అవివాహితులైనా సరే అంతిమ సంస్కారాలను ‘ఖననం’ పద్ధతిలోనే చేస్తారని ప్రముఖ జ్యోతిష్యులు సింహంభట్ల సుబ్బారావు ts29తో చెప్పారు.