ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఖమ్మం జెడ్పీ చైర్మెన్ గా లింగాల కమల్ రాజ్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిన్న ఖమ్మానికి చెందిన కొందరు జర్నలిస్టులు ఆయనకు బొకేను అందిస్తూ అభినందనలు తెలిపిన చిత్రమిది. ఈ ఫొటోను ఆయా జర్నలిస్టులే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అయితే ఏంటీ… అంటే? మళ్లీ ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనించండి.
చిత్రంలో జెడ్పీ చైర్మెన్ కమల్ రాజ్ సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో ఇద్దరు జర్నలిస్టులు ఎటువంటి మాస్కులు ధరించలేదు. మరో ఇద్దరు జర్నలిస్టులు తమ మూతులకు గల మాస్కులను దవడ కిందకు జారవిడిచారు. పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా జెడ్పీ చైర్మెన్ కు అభినందనలు తెలపడం జర్నలిస్టుల వ్యక్తిగతం. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు.
కానీ ఖమ్మం జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గాంధీ చౌక్ వంటి వ్యాపార కూడలిలో ప్రముఖ వ్యాపారులు పలువురు ఇప్పటికే కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయా ప్రాంతంలో వ్యాపారులు స్వయం ప్రకటిత లాక్ డౌన్ పాటిస్తున్నారు. మరోవైపు నిన్న ఒక్కరోజే ఖమ్మం జిల్లాలో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇంకోవైపు భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ కుమార్ కరోనాతో నిన్ననే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళా విలేకరి కూడా కరోనా బారిన పడి మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి కరోనా కల్లోల పరిణామాల్లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కొందరు జర్నలిస్టులు ఇలా మాస్కులు ధరించకుండా, ఇంకొందరు ఉన్న మాస్కులను మూతి నుంచి తొలగించి మరీ జెడ్పీ చైర్మెన్ కు ఇలా అభినందనలు తెలపడం సహజంగానే చర్చకు దారి తీసింది.
ఎందుకంటే… ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రాచుర్యంలో గల పోలీసులు, వైద్య సిబ్బంది తదితర జాబితాలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. జర్నలిస్టులు సమాజ హితం కోసం అనేక అంశాలను ప్రస్తావిస్తుంటారు. ఫలానావాడు హెల్మెట్ ధరించలేదని, ఫలానా ప్రాంతంలో కనీస భౌతిక దూరం పాటించడం లేదని, ఇంకో ప్రాంతంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని వివిధ మాధ్యమాల ద్వారా జర్నలిస్టులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెడుతుంటారు. ఇందులోనూ ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. అది జర్నలిస్టుల విద్యుక్త ధర్మం కూడా.
అదే సమయంలో ప్రస్తుత కరోనా కల్లోల పరిణామాల్లో జర్నలిస్టులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి కదా? ఇదీ సామాన్యుల ప్రశ్న. ‘మేం జర్నలిస్టులం… మాకు నిబంధనలు వర్తించవు’ అని వాదిస్తే మాత్రం చేయగలిగేదేమీ ఉండదు. ఎందుకంటే కరోనాకు జర్నలిస్టులేమీ బంధువులు కాదు. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన పలువురు జర్నలిస్టుల ఘటనలు ఇదే అంశాన్ని బోధిస్తున్నాయి కూడా.
మొత్తంగా చెప్పేదేమిటంటే… జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్సే. అందులే ఏ సందేహమూ లేదు. కానీ ఇటువంటి నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడితే మాత్రం రోడ్డున పడేది జర్నలిస్టుల కుటుంబాలే. అనేక ఘటనల్లో కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న దృశ్యం కూడా ఇదే. అదీ అసలు సంగతి.