విలేకరులు చట్టానికి అతీతమా? జర్నలిజపు నైతికతకు విరుద్ధంగా విలేకరులు ఏం చేసినా చెల్లుతుందా? వరుస వార్తా కథనాలు రాసి, కరోనా లాక్ డౌన్ పరిణామాల్లో మీడియా కార్డు చూపి సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి ఓ రాజకీయ నేతతో బేరసారాలు చేయడం చట్ట వ్యతిరేకం కాదా? రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడిన సందర్భంలోనూ ఇష్యూతో సంబంధం లేని వ్యక్తులపై బురద జల్లడం కూడా జర్నలిజపు ప్రాథమిక సూత్రమేనా? చట్ట విరుద్ధ చర్యలు ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్లు విలేకరులే కావచ్చు, రాజకీయ నాయకులైనా కావచ్చు, మరెవరైనా కావచ్చు.
ఇదే సందర్భంలో విలేకరులపై వార్తలు రాస్తారా? ఇదే జర్నలిజం అంటూ గుండెలు బాదుకుంటున్న వ్యక్తులు మాత్రం ఇతర పత్రికలకు చెందిన విలేకరులపై రాసే వార్తల గురించి మాట్లాడకపోవడమే విచిత్రం. అందినన్ని ఫొటోలు ప్రచురించి, వాళ్లు పనిచేస్తున్న పత్రికల పేర్లు, హోదాలను సైతం పేర్కొంటూ పేరాల కొద్దీ వార్తలు రాయవచ్చు. మధిరలో జరిగిన ఓ ఘటన గురించి ఇదే సూర్య పత్రిక రాసిన వార్తా కథనపు క్లిప్పింగ్ ఇందుకు నిదర్శనం. విషయం తమదాకా వచ్చేసరికి మాత్రం ఇతరులెవరూ వాళ్ల గురించి వార్తలు రాయవద్దు. జర్నలిజంలో ఇదో కొత్త వాదన. ఇంతకీ విషయమేమింటే ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబుపై వరుస వార్తా కథనాలు రాసి, రూ. 30 లక్షలతో బేరం ప్రారంభించి, అడ్వాన్సుగా కొన్ని లక్షలు స్వీకరిస్తూ సూర్య పత్రిక విలేకరులు ముగ్గురు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు విలేకరుల వసూళ్ల బాగోతాన్ని ఆధారాలతో సహా విజయ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితులైన విలేకరులపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అయితే ఈ ఘటనలో సూర్య విలేకరులను కొట్టారన్నది కూాడా ఓ ఆరోపణ. ఈ ఆరోపణ నిజమైతే మాత్రం ఇటువంటి హింసాత్మక ఘటనను ts29 సమర్థించదు. చట్టానికి ఎవరూ అతీతం కాదన్నదే అసలు సూత్రం. కానీ సత్తుపల్లిలో జరిగిన ఈ ఘటనను క్రిమినల్ రికార్డు గల అసాంఘిక శక్తులు కొన్ని తమ స్వార్థ ప్రయోజనం కోసం సంఘటనతో సంబంధంలేని వారికి పూసే విఫల యత్నం చేయడమే విచిత్రం. ఖమ్మం నుంచి సూర్య విలేకరులు సత్తుపల్లి వరకు కేవలం వివరణ కోసం 80 కిలోమీటర్లు వరకు ప్రయాణించాల్సిన అవసరం ఏమిటి? స్థానికంగా ఆ పత్రికకు విలేకరి ఉన్నపుడు విజయ్ బాబు వివరణను సత్తుపల్లి విలేకరి తీసుకుని ప్రచురణకు పంపవచ్చు కదా? వివరణ కోసమే ఖమ్మం నుంచి సూర్య విలేకరులు సత్తుపల్లి వరకు వెడితే విజయ్ బాబుతో బేరసారాలు ఎందుకు ఆడాల్సి వచ్చింది? వంటి పలు ప్రశ్నలను కాసేపు వదిలేద్దాం.
కానీ క్రిమినల్ ట్రాక్ రికార్డు గల సంఘ వ్యతిరేక శక్తుల మద్ధతు కూడదీసుకుని సంబంధం లేని వ్యక్తులపై బురద జల్లే ప్రయత్నానికి ఒడిగడితే మాత్రం, దాడికి గురైనట్లు పేర్కొంటున్న సూర్య విలేకరులపై సమాజంలో సానుభూతి కలగకపోగా, సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దిగువన గల వీడియోను వీక్షించినపుడు విజయ్ బాబుతో సూర్య విలేకరులు ఎంత ఉల్లాస భరితంగా బేరం ఆడుతున్నారో స్పష్టమవుతోంది.