జార్జిరెడ్డి సినిమా హిట్టా? ఫట్టా? వదిలేయండి. ఓ విద్యార్థి సంఘ నాయకుడి జీవిత చరిత్రను సినిమా తీసిన నిర్మాతలు వారి ఫైనాన్షియల్ పాట్లేవో వాళ్లు పడతారు. కానీ నాలుగున్నర దశాబ్ధాల కిందట దారుణ హత్యకు గురైన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డిని ఇఫ్పటికీ కొన్ని సంఘాలు, శక్తులు వదలకపోవడమే తాజా వార్తా విశేషం. ఓ సినిమా విడుదలైన సందర్భంగా జార్జిరెడ్డికి లభిస్తున్న ప్రచారాన్ని కూడా ఆ శక్తులు అంగీకరించడం లేదంటే అతిశయోక్తి కాదు. జార్జిరెడ్డి బతికి ఉంటే ఇండియన్ చే గువేరా అయ్యేవాడేమో? అంటూ అతని అభిమానులు, వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు తమ వ్యాసాల ద్వారా వేనోళ్ల కీర్తిస్తున్న పరిణామాలను కొన్ని శక్తులు జీర్ణించుకుంటున్నట్లు కనిపించడం లేదు. సీని మేధావులు, కొన్ని పత్రికలు జార్జిరెడ్డి భజనలో తరించిపోతున్నాయట. పనిలో పనిగా రెడ్డి కమ్యూనిటీని కూడా ఆ వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘క్రిస్టియన్ ముసుగులో ఉన్న రెడ్లు’ అంటూ సోషల్ మీడియాలో వార్ ప్రకటించాయి. అప్పట్లో అక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సామ్యవాద విద్యార్థి సంఘాల కారణంగా, నక్సలైట్ల కారణంగా చదువుకోవడానికి మాత్రమే వచ్చిన వారికి సీట్లు దొరికేవి కాదట. అంతేకాదు ‘జార్జిరెడ్డి తెలివైన విద్యార్థి అయితే కావచ్చు… కరడుగట్టిన విద్యార్థి సంఘం నాయకుడు అయ్యుండొచ్చు…కానీ తమ దృష్టిలో ఈ దేశం స్థితిగతులను అర్థం చేసుకోకుండా పాశ్చాత్య విప్లవ పోరాటాలను చదివి ఊగిపోయిన ఉన్మాది…జార్జిరెడ్డి ఓ మిస్ ఫైర్డ్ మిస్సయిల్’ అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని సంస్థలు యుద్ధం ప్రారంభించాయి. అర్థమైంది కదా? ఈ పోస్టింగులు ఎవరు వైరల్ చేస్తున్నారో? అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) వాళ్లు అయ్యుండొచ్చు…లేదా దాని మాతృ సంస్థల నాయకులు, కార్యకర్తలు అయ్యుండొచ్చు. అంతేకాదండోయ్…‘మేం గర్వంగా చెప్పగలం. మా ఏబీవీపీ ఈ దేశానికి నిజాయితీ గల ఒక ప్రధానిని ఇచ్చింది. ఒక ఉప రాష్ట్రపతిని ఇచ్చింది. ముగ్గురు రక్షణ మంత్రులను ఇచ్చింది. ఒక ఆర్థిక మంత్రిని ఇచ్చింది. మరో విదేశాంగ మంత్రిని ఇచ్చింది. హోం మంత్రిని కూడా ఇచ్చింది. అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చింది. మీరు చెప్పగలరా? మీ మార్క్సిస్టు, మావోయిస్టు విద్యార్థి సంఘాలన్నీ ఏమిచ్చాయో…ఈ దేశానికి?’’ అంటూ సోషల్ మీడియా పోస్టుల్లో నిలదీస్తున్నారు.
‘జార్జి’ అనే పదంలోని క్రిస్టియానిటీని ఎత్తి చూపుతున్న హిందూత్వ అభిమాన శక్తులు రెడ్డి కమ్యూనిటీని కూడా ప్రస్తావిస్తూనే…సామా జగన్మోహన్ రెడ్డి, కోతి పాపిరెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, గువ్వ మల్లారెడ్డి, జి. జయపాల్ రెడ్డి, వల్లభాపూర్ సమ్మిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చాడ శ్రీధర్ రెడ్డి, మేరెడ్డి చంద్రారెడ్డి, జితేందర్ రెడ్డిలను ’షహీద్’ లుగా స్మరిస్తూ ఏబీవీపీ కార్యకలాపాల్లో వారి త్యాగాలను సోషల్ మీడియా పోస్టుల్లో వివరిస్తున్నాయి. విద్యాసాగర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రస్తుత బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వంటి నాయకులు జార్జిరెడ్డి చేతిలో చావు చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిన నాయకులుగా పేర్కొంది. అసలు విచిత్రం ఏంటంటే…? జార్జిరెడ్డిని కీర్తిస్తున్న వారిని నిందిస్తున్న హిందుత్వ అనుకూల పార్టీ వర్గీయులు అతన్ని రాడికల్ విద్యార్థి సంఘం (RSU) నాయకుడిగా పేర్కొనడం. జార్జిరెడ్డి స్థాపించిన పీడీఎస్ (PDS) సంస్థ నేటి పీడీఎస్‌యూ (PDSU) గా రూపాంతరం చెందిందని, పీడీఎస్‌యూ నుంచే రాడికల్ విద్యార్థి సంఘం ఆవిర్భవించిందనే విషయాన్ని మరచిపోవడం. మొత్తంగా దారుణ హత్యకు గురై 45 ఏళ్లు గడిచినా ప్రత్యర్థి సంఘాలు ఇప్పటికీ వదలడం లేదంటే జార్జిరెడ్డి హీరోనా? కాదా? అనే విషయాన్ని హిందూత్వ అనుకూల సంస్థలే చెప్పాలి…అంటున్నారు జార్జిరెడ్డి అభిమానులు.