ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీజేపీకి చెందిన ఓ ఎంపీపై రూ. 100 కోట్ల మొత్తానికి పరువు నష్టం దావా దాఖలు చేశారు. ట్విటర్, ఫేస్ బుక్ ఇండియా సంస్థలను కూడా ఈ దావాలో ప్రతివాదులుగా చేర్చడం గమనార్హం.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని గోడ్డా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేయడమే దావాకు ప్రధాన కారణం.
బీజేపీ ఎంపీ నిషికాంత్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణల పోస్టింగులను ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలు కనీసం తొలగించలేదని సీఎం హేమంత్ సోరెన్ న్నారు. అందువల్ల బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పైనేగాక ట్విట్టర్ కమ్యునికేషన్స్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియా అన్ లైన్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలను కూడా ప్రతివాదులుగా చేర్చినట్లు హేమంత్ పేర్కొన్నారు.
ముంబై నగరంలో ఓ మహిళపై హేమంత్ సోరెన్ అత్యాచారం చేశారని బీజేపీ ఎంపీ రిషికాంత్ దూబే గత నెల 27న సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తూ పోస్టింగులు పెట్టారు. ఈ పోస్టుల వల్ల తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని, రూ. 100 కోట్ల మొత్తాన్ని పరిహారంగా ఇప్పించాలని కోరుతూ హేమంత్ సోరెన్ దావా దాఖలు చేశారు. దావాను విచారణకు స్వీకరించిన రాంచీ సివిల్ కోర్టు కేసును ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.