‘చారాణా’ కోడికి ‘బారాణా’ మసాలా సామెత తెలుసుగా? పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నమాట. పావలా, ముప్పావలా పదాలకూ నేటి జనరేషన్ కు అర్థం తెలియకపోతే… 0.25 పైసల కోడిని కూర వండడానికి 0.75 పైసల చికెన్ మసాలా దట్టించాలన్నమాట. సామెత అర్థం బోధపడినట్లేగా! తెలంగాణా ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) ఛార్జీలు ఇదే తరహాలో ఉన్నాయనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎల్ఆర్ఎస్ బాదుడుపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చక్కర్లు కొడుతోంది. రాసిందెవరోగాని అనేక ప్రశ్నలను కూడా సంధించారు. ఈ పోస్టును ఆసాంతం చదివాక ‘చారాణా’ కోడికి ‘బారాణా’ మసాలా నానుడికి పేరడీగా ‘పావలా ప్లాటుకు ముప్పావలా ఎల్ఆర్ఎస్’ బాదుడు అని అన్వయించక తప్పదు. customer పేరుతో చక్కర్లు కొడుతున్న ఆయా పోస్టును దిగువన చదవండి.
customer -:
‘‘నాకు రెండొందల గజాల జాగా వుంది.
ఐదు సంవత్సరాల క్రితం మన బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తీసుకున్నాను.
దానికి ఇరువైపులా ఇరవై ఫీట్ల రోడ్డు ఉంది కేసీఆర్ ఎల్ఆర్ఎస్ స్కీం వలన నాకు జరుగుతున్న నష్టం.
ప్లాటు డెమన్షన్ 30/60 .
అంటే 30 ఫీట్ ఉన్న రోడ్డు వైపు
రోడ్డు కటింగ్ ×5=150 ఎస్ ఎఫ్ టీ =16.777777 గజాలు.
60 ఫీట్ ఉన్న రోడ్డు వైపు ×5= 300 ఎస్ ఎఫ్ టీ= 33.333333
అంటే 30″ రోడ్డు ఉన్న వైపు 16.777777
60″ రోడ్డు ఉన్న వైపు 33.333333. ________________________________
= 50 గజాల కంటే ఎక్కువ
అంటే 200 గజాలలో నుండి 50 గజాలు నష్టపోయాను.
50 గజాలకు నేడు మార్కెట్ వాల్యూ గజానికి 21000/_
అంటే 50×21000= 10,50000 (అక్షరాల పది లక్షల యాభై వేలు) నాకు జరుగుతున్న నష్టం
మరియు ఎల్ ఆర్ ఎస్ స్కీం ద్వారా మిగిలిన 150 గజాలకు నేను కట్టాల్సిన పైకము (నాకు జరుగుతున్న నష్టం)
నాకు తెలిసిన లెక్క ప్రకారం 150 గజాలు×400(నాలుగు వందలు)= 60000/_(అక్షరాల అరవై వేల రూపాయలు).
నాకు జరిగిన నష్టం:- 1050000+60000=1110000/_ (అక్షరాల పదకొండు లక్షల పదివేలు.
అంటే అప్పుడు (అయిదేళ్ల క్రితం) నేను ప్లాట్ తీసుకున్నప్పుడు
రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు తప్పు చేసినట్లా?
ఆ ప్లాట్లను వేసిన వెంచర్ ఓనర్ తప్పు చేసినట్లా?
నేను ప్లాట్ కొన్న ప్రాంతంలో అధికారంలో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే లు తప్పు చేసినట్లా?
లేక అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు మరియు మంత్రులు తప్పు చేసినట్లా?
భూమి పైన వేసే పది మందికి కనబడే అక్రమ లే అవుట్ లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిందెవరు?
దానిని చూసీ చూడనట్లు వదిలేసిందెవరు?
అక్రమ రుసుములు చెల్లించాల్సిందెవరు?
శిక్షలను అనుభవించాల్సిందెవరు?
కాయకష్టం చేసి, పైసా పైసా కూడబెట్టి ప్లాట్లను కొనుగోలు చేసిన మాలాంటి సామాన్యులకు ఏమిటి ఈ శిక్ష?’’