ప్లాస్టిక్ వ్యర్థాలు.. ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద భూతం. మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్ భూతం జంతువుల పాలిట కూడా ప్రాణాంతకంగానే పరిణమించిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్న పశువుల గురించి విన్నాం. సముద్ర ప్రాణులు సైతం విగత జీవులుగా మారిన ఉదంతాలు అనేకం.
ఇదిగో ఈ పామును చూడండి. ఎలుకగా భావించిందో, పందికొక్కే అనుకుందో గాని ప్లాస్టిక్ బాటిల్ ను చటుక్కున మింగేసింది. కాసేపయ్యాక గాని దానికి తెలియనట్టుంది.. తాను మింగింది తన ఆహారపు ప్రాణి కాదని. పొట్ట ఉబ్బడంతో చాలా సేపు అవస్థలు పడిన పాము ఎలాగోలా తాను తిన్న ప్లాస్టిక్ బాటిల్ ను కక్కడానికి ప్రయత్నించింది. అనేక దఫాలు ప్రయత్నించాక గ్రీన్ కలర్ ప్లాస్టిక్ బాటిల్ పాము కడుపులోంచి బయటకు వచ్చింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కశ్వాన్ ప్లాస్టిక్ బాటిల్ మింగిన ఈ పాముకు సంబంధించి 48 సెకన్ల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్లాస్టిక్ వస్తువులను పడేసే విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల పాలిట ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు.