వరంగల్ మహానగరంలో తీవ్ర కలకలం కలిగించిన ముగ్గురు దారుణ హత్యోదంతంలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ కు చెందిన చాంద్ పాషా కుటుంబంపై అతని సొంత తమ్ముడు షఫీ, మరికొందరితో కలిసి నిన్న ఉదయం దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మహ్మద్ షఫీ, అతనికి సహకరించిన బోయిని వెంకన్న, మహ్మద్ సాజిద్, మహ్మద్ మీరా అక్బర్, రాగుల విజేందర్, మహ్మద్ పాషాలను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గురువారం మీడియాకు వివరించారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ, హత్యకు గురైనవారిలో మహమ్మద్ చాంద్ పాషా, ఘటనలో ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీ స్వయాన అన్నదమ్ములు. వీరికి నలుగురు అక్కా, చెల్లెళ్లు ఉన్నారు. వీరు పది సంవత్సరాల క్రితం పర్కాల ప్రాంతం నుండి తరలివచ్చి వరంగల్ నగరంలో స్థిరపడ్డారు. చాంద్ పాషాతోపాటు ప్రధాన నిందితుడు షఫీ ఇరువురు గత ముప్పై సంవత్సరాలుగా పర్కాల, జంగాలపల్లి, ఏటూరునాగారం ప్రాంతాల్లో పశువులను కొనుగోలు చేసిన వాటిని హైదరాబాద్ లోని కబేళాలకు తరలించే వ్యాపారాన్ని నిర్వహించేవారు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే లాభాన్ని అన్నదమ్ములు ఇరువురు సమానంగా వాటాలను పంచుకోనేవారు.

అయితే గత రెండు సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో వీరికి నష్టాలు రావడంతో, గతంలో జరిగిన వ్యాపారంలో తన అన్న (మృతుడు) ఎక్కువ మొత్తంలో లాభాలను తీసుకోవడం జరిగిందని నిందితుడు అభియోగం చేయడంతో పాటు, వ్యాపారం నష్టాల రావడంతో చెల్లించాల్సిన అప్పులను చెల్లించి తనకు రావాల్సిన వాటా డబ్బును తిరిగి ఇవాల్సిందిగా పెద్ద మనుషుల మధ్య పంచాయితీని నిర్వహించాడు. ఇందుకు చాంద్ పాషా అంగీకరించకపోవడంతో చేసిన అప్పులు చెల్లించాల్సిన బాధ్యతపై షఫీని చాంద్ పాషా ఒత్తిడి చేసాడు. ఆరునెలల క్రితం పశువులను కొనుగోలు చేసిన రైతులకు, ఇతర వ్యాపారస్థులకు డబ్బులు చెల్లించాల్సి వున్నందున సదరు రైతులు, వ్యాపారులు తమ పశువులను నిలిపివేయడంతో చెల్లించాల్సిన డబ్బులకు నాకు ఎలాంటి సంబంధం లేదని వాటిని తన తమ్ముడు చెల్లిస్తాడని రైతులను షఫీ వద్దకు చాంద్ పాషా పంపించేవాడు.

ఈ లావాదేవీలకు సంబంధించి షఫీ పలుమార్లు చాంద్ పాషాను సంప్రదించగా, అతను ఏ విధంగానూ స్పందించలేదు. దీంతో షఫీ తన అన్న చాందా పాషాపై కక్ష పెంచుకుని, అన్న సహా అతని కుటుంబ సభ్యులను చంపేందుకు తమ్ముడు షఫీ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా షఫీ తమ వద్ద పనిచేసే వారితో పాటు తన మిత్రులైన పాషా, సాజిద్ విజేందర్, మీర్జా అక్బర్, వెంకన్నల సహాయం కోరగా, ఇందుకు వారు అంగీకరించారు. ఈ హత్యా పథకాన్ని అమలు చేసేందుకుగాను హైదరాబాద్ లో ఐదు వేట కత్తులతో పాటు వరంగల్ నగరంలో బ్యాటరీతో పనిచేసే చెట్లను నరికే మిషన్ కోనుగోలు చేశారు. వీటిని ఎవరి కంట పండకుండా షఫీ తన ఇంటిలోనే రహస్యంగా భద్రపర్చాడు.

పథకం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రధాన షఫీ పిలుపు మేరకు మిగతావారు కలుసుకున్నారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో తన వెంట ఒక జత బట్టలను తీసుకుని సాజిద్, పాషా ఆటోల్లో మిగతా ముగ్గురు షఫీ ఇంటి నుండి బయలుదేరగా, షఫీ తన అన్న ఇంటికి మార్గం చూపించేందుగాను ద్విచక్ర వాహనంపై బయలుదేరి చాంద్ పాషా ఇంటికి తీసువెళ్ళారు. చాంద్ పాషా ఇంటి ముందు ఆటోలో అగిన ఆయా వ్యక్తులు ముందుగా చెట్లను నరికే మిషన్ శబ్దం పక్క ఇండ్ల వాళ్ళకు వినిపించకుండా వుండేందుకుగాను ఆటో శబ్ధాన్ని పెంచారు. ఇదే సమయంలో చెట్లను నరికే మిషనను వెంకన్న తీసుకోగా, మిగితా వారు వేట కత్తులతో పాటు కారం ప్యాకెట్లు తమ వెంట తీసుకుని చాంద్ పాషా ఇంటి ప్రధాన ద్వారం తలుపును చెట్లను నరికే మిషన్ తో తొలగించడంతో పాటు కరెంట్ సరఫరాను నిలిపేశారు.

ఈ శబ్దాలకు చాందాపాషా నిద్రనుండి లేచి గట్టిగా అరవడంతో అతని భార్య, బావమరిది, ఇద్దరు కుమారులు నిద్రనుండి లేవడంతో షఫీ తదితరులు ఒక్కసారిగా చాంద్ పాషా కుటుంబ సభ్యులపై కారం చల్లి రంపం మిషన్, వేట కత్తులతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో చాందా పాషాతో పాటు, అతని భార్య సబీరాబేగం, బావమరిది ఖలీల్ పాషా సంఘటన స్థలంలోనే మృతి చెందగా, చాంద్ పాషా కుమారులు తీవ్రంగా గాయపర్చగా, చాంద్ పాషా కుమార్తె గదిలో నుండి బయటకి వచ్చి గట్టిగా అరుస్తూ నిందితులను వేడుకుంది. ఇదే దశలో చనిపోయే ముందు చాంద్ పాషా తదితరుల ఆరుపులకు చుట్టు పక్కల వారు వస్తుండంతో నిందితులు ఆటోల్లో అక్కడి నుండి తప్పించుకున్నారు.

Comments are closed.

Exit mobile version