Deeds, not words… మాటలు కాదు… చేతలు… ఇది ఖమ్మం పోలీసుల ‘లోగో’లోని నినాదం. ఈ నినాదానికి అనుగుణంగానే ఖమ్మం పోలీసులు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే… సాధారణంగా పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతారనే విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా విపక్ష నేతల నుంచి తరచుగా ఈ తరహా ఆరోపణలు వినిపిస్తుంటాయి. కానీ ఖమ్మం నగర పోలీసులు మాత్రం ఇందుకు విరుద్ధమనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫిర్యాదు అందిందే తడవుగా అందులో పేర్కొన్న నాయకులు అధికార పార్టీకి చెందినవారైనప్పటికీ ఏ మాత్రం సంకోచించకుండా కేసులు నమోదు చేస్తుండడం గమనార్హం.
తాజాా ఘటనను పరిశీలిస్తే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబుపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక కేసు నమోదు చేశారు. డీసీసీబీకి 2013-18 కాలంలో పాలకవర్గంగా పనిచేసిన విజయ్ బాబు సహా మొత్తం 21 మంది డైరెక్టర్లపై ఐపీసీ 403, 406, 409, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పేర్కొన్న మువ్వా విజయ్ బాబు గతంలో తుమ్మల నాగేశ్వర్రావు అనుచరునిగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరంలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ, తమకు అందిన ఫిర్యాదు మేరకు ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. మొత్తం 21 మంది అప్పటి డైరెక్టర్లలో అనేక మంది ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉండడం కూడా గమనార్హం.
అదేవిధంగా అధికార పార్టీకి అనుబంధ సంఘంగా పేరుగాంచిన జర్నలిస్టు సంఘం జిల్లా నాయకుడిపైనా ఖమ్మం త్రీటౌన్ పోలీసులు పదిహేను రోజుల క్రితం ఓ కేసు నమోదు చేశారు. ప్రస్తుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు అనుచరునిగా పేరుగాంచిన ఓ వ్యక్తిపైనేగాక మరో ఇద్దరు జర్నలిస్టులపైనా ఈనెల 14వ తేదీన ఐపీసీ 290, 505 (1), 505 (2), 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తంగా ఖమ్మం త్రీటౌన్ పోలీసులు నమోదు చేసిన ఆయా రెండు ఘటనల కేసులు చర్చనీయాంశంగా మారాయి.