‘ఇక తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు పొంచి ఉందా? ఖమ్మం కేంద్రంగా కరోనా బాంబు పేలబోతోందా? వాయు మార్గంలో వందల కిలోమీటర్లు ప్రయాణించి కరోనా వైరస్ ఇక్కడికి చేరుకుందా? అసలు ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతోంది? కరోనా ముప్పు మనకు లేదని ప్రశాంతంగా నిద్రపోతున్నవారికి ఇది ఉలిక్కి పడే వార్త.’ అంటూ నిన్న టీవీ9 న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వార్తా కథనపు సారాంశంలోని యాంకర్ బీభత్స వ్యాఖ్యలివి. ఈ వార్త చూసిన వారిని నిజంగానే ఉలిక్కి పడేలా చేసిన యాంకర్ ఉచ్ఛారణ వార్తా కథనానికి అదనపు ఆకర్షణ. ఐదు నిమిషాలకు పైగా సాగిన ఈ వార్తా కథనంలో దాదాపు నాలుగు నిమిషాల పాటు గ్రామస్తుల ఆందోళన, అనుమానం, చింతపల్లి స్మశానంగా మారుతుందనే భయం తదితర వ్యాఖ్యలతో వార్తా కథనం సాగింది. చివరలో ఇది వాస్తవం కాదని డాక్టర్లు (?) తేల్చేశారంటూ టీవీ9 తన వార్తా కథనానికి ముగింపు ఇచ్చిందన్నది వేరే విషయం.
ఏటా శీతాకాలపు సీజన్లో సైబీరియా నుంచి ఖమ్మం జిల్లా కేంద్రం పరిసరాల్లో గల చింతపల్లికి వలస వచ్చే ఎర్ర కాళ్ల కొంగల గురించి టీవీ9 తనదైన రీతిలో ప్రసారం చేసిన వినూత్న కథనమిది. ఏటా వచ్చే అవే కొంగల గురించి, వాటి జీవనశైలి గురించి, వాటి అందచందాల గురించి, చింతపల్లి గ్రామస్తుల సెంటిమెంట్ గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? ఉబుసుపోక రాసుకునే వార్తలుగా టీవీ9 భావించిందేమో? అందుకే సరికొత్త కోణంలో చింతపల్లి వలస కొంగల గురించి వార్తా కథనాన్ని ప్రసారం చేయడం ద్వారా ఆయా న్యూస్ ఛానల్ తనదైన శైలిని కనబర్చిందని చెప్పక తప్పదు. ఇందులో భాగంగానే సైబీరియా కొంగలు కరోనా వైరస్ (కొవిడ్-19) ను మోసుకొస్తున్నాయనే కంటెంట్ తో వార్తా కథనాన్ని ప్రారంభించి అదేమీ లేదంటూ డాక్టర్లు చెబుతున్నారని చివరలో తేల్చేశారు. ‘అశ్వత్థామ హతః కుంజర’ టైపు అన్నమాట.
సరే ఇక అసలు విషయంలోకి వద్దాం. సైబీరియా పక్షులు దాదాపు 5,092 కిలోమీటర్లు ప్రయాణించి ఖమ్మం జిల్లా చింతపల్లికి చేరుకుంటాయి. కొంగలు దినసరి గరిష్టంగా 322 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంటే సైబీరియా నుంచి ఖమ్మం జిల్లా చింతపల్లి చేరడానికి ఎర్ర కాళ్ల కొంగలకు కనీసం 16 రోజుల వ్యవధి పడుతుంది. గూగుల్ చెబుతున్న సమాచారం ప్రకారం ఈ పక్షులు సైబీరియా నుంచి చైనా మీదుగా ప్రయాణించవు. కజకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియాకు ప్రయాణిస్తాయి. ఇవి వెచ్చటి వాతావరణంలోనే ప్రయాణిస్తాయి. చల్లటి వాతావరణంలో తమ ప్రయాణాన్ని కొనసాగించవు.
ఇటువంటి జీవనశైలి గల సైబీరియా కొంగలకు కరోనా వైరస్ సోకితే అసలు అవి గాల్లోకి ఎగురుతాయా? కరోనా వైరస్ సోకిన మనుషులే కదల్లేని పరిస్థితుల్లో, చైనాలోని ఆసుపత్రుల్లో మంచానికే పరిమితమవుతున్నారు. అన్ని రకాల వైద్య చికిత్స అందిస్తున్నా వైరస్ సోకిన మనుషుల ప్రాణాలు 28 రోజుల్లో గాల్లో కలిసి పోతున్నాయి. ఏ చికిత్సకు నోచుకోని సైబీరియా కొంగలకు కరోనా వైరస్ సోకితే, అనారోగ్య పరిస్థితుల్లోనూ అది గాల్లోకి ఎగిరి దినసరి 322 కిలోమీటర్లు ప్రయాణిస్తుందా? ఒక వేళ అందుకు సాహసం చేసినా కరోనా వైరస్ తోనే 16 రోజులపాటు గాల్లో ప్రయాణిస్తూ చింతపల్లి వరకు రాగలుతుందా? మధ్యలోనే కొంగల ప్రాణం గాల్లో కలిసిపోతుందా? ఇవీ అసలు సందేహాలు.
సరే ఎవరి టీవీ వాళ్ల ఇష్టం. కానీ ఈ కొంగలు చైనా మీదుగా ప్రయాణించి కరోనా వైరస్ ను మోసుకొస్తున్నాయని, ‘హతః కుంజర’ తరహాలో వార్తా కథనం సాగితే… భయాందోళన చెందిన చింతపల్లి వాసులు ఏటా వచ్చే వేలాది సైబీరియా పక్షులను చంపేస్తే? వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితులపై ఏవేని కేసులు నమోదైతే? అందుకు బాధ్యులెవరన్నదే అసలు ప్రశ్న. చెప్పొచ్చేదేమిటంటే ఒక్కోసారి రిపోర్టర్లు తెలిసో, తెలియకో, సమాచార లోపం వల్లనో వార్తలు రాయొచ్చు. కానీ అందులోని నిజా నిజాలను, జనహితాన్ని గుర్తించిన తర్వాతే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మాత్రం డెస్క్ బాధ్యులదే. అదీ అసలు విషయం.
ఇక ఏ సంకోచం లేకుండా చింతపల్లిలో అందమైన సైబీరియా పక్షుల సందడిని దిగువన స్లైడ్ షోలో వీక్షించండి.