దాదాపు పాతికేళ్ల క్రితం… అది 1994-95 సంవత్సరం. అతనో ఎస్ఐ. పోలీసు శాఖలో 1989 బ్యాచ్ కు చెందిన అధికారి. మణుగూరు, అశ్వాపురం ప్రాంతాల్లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసి పాల్వంచకు బదిలీ అయ్యారు. ఇక్కడా కొంత కాలం పని చేసిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.
వాస్తవానికి ఈ ఎస్ఐకి పోలీసు శాఖలో చాలా మంది పేరుండేది. వృత్తి నిబద్ధత, నీతి, నిజాయితీ గల అధికారిగానే కాదు సౌమ్యుడిగానూ, సున్నిత మనస్కుడిగానూ ప్రాచుర్యం పొందారు. పాల్వంచ ఎస్ఐగానూ ప్రజల మన్ననలు విశేషంగా చూరగొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్ఐగా పనిచేసిన ఆయా అధికారి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందారు.
పాల్వంచ నుంచి కాటారానికి అకస్మాత్తుగా బదిలీ అయిన ఆ ఎస్ఐ ఓరోజు అనూహ్యంగా తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు శాఖలో మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడిన కారణాలపై అప్పట్లో భిన్న ప్రచారం కూడా జరిగింది.
ఇంతకీ ఆ ఎస్ఐ అప్పట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ అధికారి కాటారానికి బదిలీ కావడానికి ముందు ఎవరేని రాజకీయ నేత కుమారుడిపైన అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయా? ఆత్మహత్యకు పాల్పడిన ఆ ఎస్ఐ అప్పటి యువ నేతతో ఘర్షణ కూడా పడిన దాఖలాలు ఉన్నాయా? ఎస్ఐ ఆత్మహత్యకు దారి తీసిన పరిణామాలపై అప్పటి ఎస్పీ యువ నేత ప్రవర్తనకు సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినట్లు ప్రచారం ఉండడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదీ అప్పటి ఘటనకు సంబంధించి తాజాగా ప్రజల్లో చర్చగా మారిన అంశం.
ఫొటో: ప్రతీకాత్మక చిత్రం