రెవెన్యూ శాఖలో లంచావతారాలుగా ‘విజిలెన్స్’ విభాగం నివేదించిన ‘వసూల్ రాజా’లకు షోకాజ్ నోటీసులు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రెవెన్యూ శాఖకు చెందిన అనేక మంది అధికారులు, సిబ్బంది పేదల డబ్బుకు కక్కుర్తి పడి, చిల్లర వసూళ్లకు పాల్పడుతున్నారని విజిలెన్స్ విభాగం నివేదించిన సంగతి తెలిసిందే.
రెవెన్యూ శాఖలోని తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు సహా 43 మంది పేదల సొమ్ముకు ఆశపడి అక్రమంగా వసూళ్లు చేసినట్లు విజిలెన్స్ విభాగం సవివరంగా నివేదించింది. వసూళ్ల కోసం ప్రజాప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకున్నారని కూడా విజిలెన్స్ నివేదించింది. ఈమేరకు విజిలెన్స్ నివేదికలోని వసూల్ రాయుళ్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గత జూన్ నెలలోనే ఉత్తర్వు జారీ చేశారు.
అయితే ఈ అంశంలో అనేక మంది కలెక్టర్లు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వును పట్టించుకోకుండా తొక్కిపెట్టారు. విజిలెన్స్ నివేదికను ts29.in న్యూస్ పోర్టల్ తొలుత వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక సీఎస్ ఉత్తర్వును కొందరు కలెక్టర్లు బుట్టదాఖలు చేసిన అంశాన్ని కూడా గుర్తు చేస్తూ అనేక వార్తా కథనాలను ts29.in ప్రచురించింది.
ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ నివేదికలో వసూల్ రాయుళ్లుగా వెలుగులోకి వచ్చిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు సహా మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు అందాయి. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలని ప్రశ్నిస్తూ సీసీఎల్ఏ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం.