మరో మహానగర పాలక సంస్థకు, ఇంకో కార్పొరేషన్ కు, మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు తరుముకొస్తున్నవేళ… టీఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు టాటా చెబుతున్నారు. ‘బెల్లం ఉన్నచోటే ఈగలు వాలుతాయి’ అనే సామెతకు అనుగుణంగా అధికారం ఉన్నచోటుకే నాయకులు సహజంగా వలస వెడుతుంటారు. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సరిగ్గా ఇవే సీన్లు కనపించాయి. ఆ తర్వాత ఇటువంటి నేతలకు అధికార పార్టీ ద్వారా ఆశించిన ప్రయోజనం లభించిందా? లేదా? అనేది వేరే విషయం. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచేగాక, స్వతంత్రంగా గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఓటు వేసిన ఓటరు చేతిపై సిరా మరక ఆరకముందే అధికార పార్టీ పంచన చేరిన ఘటనలు అప్పట్లోనే కాదు, ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలాయి. సాధారణంగా అధికారంలో గల పార్టీవైపు లీడర్ చూస్తుంటాడు. కానీ తాజా దృశ్యంలో మాత్రం అధికార పార్టీ నుంచి ఇతర పార్టీల్లో చేరుతుండడమే అసలు విశేషం.

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్థిక ప్రవీణ్ ఇటీవలే తన సొంంతగూటికి చేరిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపునే కౌన్సిలర్ గా గెల్చినప్పటికీ, ఆ తర్వాత చైర్మెన్ గా ఎన్నికయ్యారు. కానీ ఆర్థిక ప్రవీణ్ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరడం విశేషం. అసలే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిలిన ఫలితాల షాక్ నుంచి అధికార పార్టీ నేతలు పూర్తిగా తేరుకోకముందే మరికొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తుండడం ఆసక్తికర పరిణామమే. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 37వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య ఆ పార్టీకి గట్టి షాక్ నిచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి దారి తీసిన పరిణామాలను ఏకరవు పెడుతూ ఓ లేఖ కూడా రాయడం విశేషం. సాంబయ్య ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఇప్పటికిప్పుడు స్పష్టత లేకున్నా, ఈ ఘటన వరంగల్ నగర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచులు, ఇతర నాయకులు తాజాగా బీజేపీలో చేరారు. ఈనెల 5న వరంగల్ లో, 7న నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా బీజేపీలోకి భారీ సంఖ్యలో నేతల చేరికలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి.

వరంగల్, ఖమ్మం వంటి ప్రముఖ నగరాల్లో మరికొద్ద రోజుల్లోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన ప్రచార పంథాను మార్చడం విశేషం. హైదరాబాద్ తరహా ‘మత’ ప్రాతిపదిక వ్యాఖ్యల ద్వారా ఆయా నగరాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఇందుకు స్థానిక పరిస్థితులే కారణంగా భావిస్తున్నారు. అందువల్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈసారి స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే నినదించే అవకాశాలున్నాయి. వరంగల్ నగరాభివృద్ధిపై ఆయన ఇప్పటికే ఇటువంటి ప్రచారానికి శ్రీకారం చుట్డడం గమనార్హం. స్మార్ట్ సీటీల పథకంతో దేశంలోని ప్రముఖ నగరాల రూపురేఖలు మారాయని, అయితే కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్మకున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. స్మార్ట్ సిటీల స్పీడ్ కు కేసీఆర్ సర్కార్ బ్రేకులు వేసిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్, కరీంనగర్ లకు కేంద్రం రూ. 392 కోట్లు కేటాయించగా, టీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. దీంతో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు.

మరోవైపు వరంగల్, ఖమ్మం నగరాల్లో బీజేపీ నేతలు అప్పుడే ఎన్నికల ప్రచారానికి దిగడం విశేషం. వరంగల్ మహానగరంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఖమ్మంలో చింతల రామచంద్రారెడ్డి తదితర నాయకులు మున్సిపల్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఈ దశలోనే అధికార పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు ‘కారు’ దిగుతుండడం ఆ పార్టీకి అనూహ్య పరిణామంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version