హైదరాబాద్ లో కూల్చివేతలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడు నాయుడు సత్యం అలియాస్ సత్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డికి ఘాటు లేఖ రాశారు. లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్యం కేవలం భట్టి ప్రధాన అనుచరుడే కాదు.. తెలంగాణ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కావడం విశేషం. హైదరాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలను అప్రజాస్వామికంగా ఆయన అభివర్ణించడం గమనార్హం. మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం అత్యంత దారుణమని కూడా ఆయన తన లేఖలో వ్యాఖ్యానించారు. పేదలకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, ఏకపక్షంగా హైడ్రాతో నివాసాలను నేలమట్టం చేయడం సరికాదన్నారు. కూల్చివేతలపై నోటీసులు కూడా ఇవ్వకుండా హడావుడిగా చర్య తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. దీని వల్ల హైడ్రా వ్యవహార తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు.
గతంలో ఇందిరమ్మ కాంగ్రెస్ సర్కారు దేశవ్యాప్తంగా పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తే, ఇప్పుడు తెలంగాణలో అందుకు విరుద్ధంగా మన ప్రభుత్వం పేదల ఇండ్లను కూలగొట్టడమేంటని ప్రశ్నిస్తూనే ఇంకోవైపు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, పేదల హక్కులను, ఆస్తులను రక్షించాలని హితవు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి, ప్రగతికి ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులను రక్షించడం అత్యవసరమైనప్పటికీ, దశాబ్దాల కష్టార్జితంతో పేదలు కట్టుకున్న గూడును, జీవితాంతం శ్రమించి సంపాదించిన ఆస్తిని ధ్వంసం చేయడం వారికి మానసిక వేదనను కలిగిస్తుందని పేర్కొన్నారు. మూసీ పరీవాహకంలో ఇండ్ల కూల్చివేతల నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని నాయుడు సత్యం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
నిజానికి నాయుడు సత్యం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంగల నాయకుడు కాకపోయినప్పటికీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కుడిభుజంగా ఆయన ప్రాచుర్యం పొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నాయుడు సత్యం తనదైన ముద్రను కలిగి ఉన్నారు. దశాబ్ధాలపాటు కాంగ్రెస్ పార్టీను నమ్ముకుని కమ్యూనిస్టులతో రాజకీయ పోరాటం చేసిన నేపథ్యం నాయుడు సత్యానికి ఉంది. కేవలం సీఎం రేవంత్ రెడ్డికే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు నాయడు సత్యం గత నెల 30వ తేదీన ఆయన ఈ లేఖలను రాశారు. భట్టికి అత్యంత ముఖ్య అనుచరునిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో కూల్చివేతలపై నాయుడు సత్యం రాసిన లేఖ సహజంగానే రాజకీయ చర్చకు దారి తీసింది. భట్టి ఆశీస్సులతోనే నామినేటెడ్ పదవిని దక్కించుకున్న నాయుడు సత్యం ప్రభుత్వ పోకడను ఆక్షేపిస్తూ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
కాగా కూల్చివేతలపై తాను లేఖ రాసిన విషయం వాస్తవమేనని రాష్ట్ర హ్యాండీ క్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం ts29.inతో చెప్పారు. ఇది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికే గాక, రాహుల్ గాంధీకి, డిప్యూటీ సీఎం భట్టికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కూడా ఈ విషయంపై లేఖ రాశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హితవు కోరుతూ, సూచనలతో మాత్రమే ముఖ్యమంత్రికి తాను లేఖ రాశానన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు ఎలా లీకైంతో తనకు తెలియదని నాయుడు సత్యం చెప్పారు.