సహచర క్లీనర్ కు చంపేసి, అతని శవంతోనే వందలాది కిలోమీటర్లు ప్రయాణించిన ఓ లారీ డ్రైవర్ ఘాతుకమిది. నిందితుడు పోలీసులకు వివరించిన కథనం ప్రకారం… కాకినాడకు చెందిన ఓ లారీ పామాయిల్ లోడ్ తో మంథనికి వెళ్లింది. అక్కడ సరుకు అన్ లోడ్ జరిగాక, తిరుగు ప్రయాణంలో నూకల లోడ్ తో వస్తున్న లారీకి గల పట్టా ఊడింది. దీంతో సుల్తానాబాద్ వద్ద లారీని నిలిపి పట్టా కట్టాల్సిందిగా డ్రైవర్ క్లీనర్ ను కోరగా, ఇందుకు క్లీనర్ నిరాకరించాడు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్, క్లీనర్లు సుల్తానాబాద్ వద్ద ఘర్షణకు దిగారు.
డ్రైవర్ పై క్లీనర్ కత్తితో దాడికి యత్నించాడు. అప్రమత్తమైన డ్రైవర్ పి. నైఫ్ రాజు క్లీనర్ ను జాకీతో తలపై మోదాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపేశాడు. ఘటనానంతరం చనిపోయిన క్లీనర్ శవాన్ని తన పక్కనే గల సీట్లో కూర్చోబెట్టుకుని మరీ ఖమ్మం జిల్లా కొణిజర్ల వరకు డ్రైవర్ ప్రయాణించాడు. దాదాపు 250 కిలోమీటర్ల మార్గంలో నిందితుడు తాను పొడిచి చంపిన క్లీనర్ శవంతోనే ప్రయాణించడం, మార్గమధ్యంలో నేరుగా పోలీసులకు లొంగిపోవడం కలకలం సృష్టించింది. శవంతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన నిందితుడు నైఫ్ రాజును చూసి కొనిజర్ల పోలీసులు నిర్ఘాంతపోయారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఫొటో: లారీలో పడి ఉన్న క్లీనర్ శవం