ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ పాలసీ) పదవికి సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్ర మూర్తి మంగళవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేఆర్ మూర్తి ts29తో ధృవీకరించారు కూడా. ఈ ఉదయమే తాను తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రామచంద్రమూర్తి రాజీనామా అంశం అటు ఏపీ ప్రభుత్వ వర్గాల్లోనేగాక, ఇటు జర్నలిస్టు సర్కిళ్లలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.
గత మే నెలలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది ప్రచారం మాత్రమేనని అనంతర పరిణామాల్లో తేలిపోయింది. తాజాగా రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇందుకు దారి తీసిన కారణాలు ఏమిటన్నది మాత్రం వెల్లడి కాలేదు. తాను తన పదవికి రాజీనామా చేయడంలో విచారించాల్సిందిగాని, బాధ పడాల్సిందిగాని ఏమీ లేదని రామచంద్రమూర్తి ts29తో వ్యాఖ్యానించారు.