తెలంగాణాలో రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిలతో సీనియర్ ఎడిటర్, ఆంధప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు, సాక్షి మీడియా గ్రూపు సంస్థల మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొండుభట్ల రామచంద్రమూర్తి భేటీ కావడం ఆసక్తికర అంశంగా మారింది. కేఆర్ మూర్తిగా జర్నలిస్టు లోకం అభిమానంతో పిల్చుకునే రామచంద్రమూర్తి రాజకీయ నాయకుడేమీ కాదు. జర్నలిజమే జీవితంగా పెనవేసుకున్న సీనియర్ ఎడిటర్. ఆంధప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పబ్లిక్ పాలసీ ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. అయితే అనేక కారణాలవల్ల కేఆర్ మూర్తి జగన్ ప్రభుత్వ సలహాదారు పదవికి గత ఆగస్టు 25వ తేదీన రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలోనే రామచంద్రమూర్తి వైఎస్ షర్మిలను సోమవారం కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు ఆరు నెలల క్రితం జగన్ ప్రభుత్వంలో సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు షర్మిలతో భేటీ కావడం వెనుక ఏదేని ప్రాముఖ్యత ఉందా? అనే అంశంపై జర్నలిస్టు సర్కిళ్లలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. షర్మిల పార్టీ ఏర్పాటులో కేఆర్ మూర్తి ముఖ్య సలహాదారుగా ఉండే అవకాశం ఉందా? అనేది జరుగుతున్న చర్చలోని అసలు సారాంశం. షర్మిలతో భేటి గురించి ts29 రామచంద్రమూర్తిని ప్రశ్నించగా, షర్మిల ఆహ్వానం మేరకే తాను వెళ్లానని చెప్పారు. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ లేదన్నారు. ఆమెతో సంభాషించిన స్వల్ప వ్యవధిలో ఇష్టాగోష్టిగా మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తాను స్థాపించబోయే పార్టీ వెనుక బీజేపీ హస్తంగాని, సీఎం కేసీఆర్ వ్యూహం గాని లేవని తన భేటీలో షర్మిల స్పష్టం చేసినట్లు రామచంద్రమూర్తి పేర్కొన్నారు.