ఔను కలాలు కిరాయికి అమ్మబడుతున్నాయి అనుకుందాం… కొద్దిసేపు ఈ వాదనకే కట్టుబడదాం. కేవలం శేఖర్ గుప్తా అనే ప్రముఖ పాత్రికేయుడిని మాత్రమే ప్రస్తుతం నిందిస్తున్నాం కదా? ‘ది ప్రింట్’ ఎడిటర్-ఇన్-చీఫ్ బాధ్యతల్లో గల శేఖర్ గుప్తా వ్యక్తీకరించిన అభిప్రాయంపై అనేక ‘పవిత్ర’ కలాలు విరుచుకుపడుతున్నాయి కదా? కాబట్టి శేఖర్ గుప్తా వాదనను సమర్ధించడం కాదిక్కడ. ధ్వనికి ప్రతిధ్వని ఉంటుంది. స్పందనకు ప్రతిస్పదన ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. శేఖర్ గుప్తా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నామంటే, మనం మరెవరి తరపునో వకాల్తా పుచ్చుకున్నట్లే కదా? ఇంకెవరికో మద్ధతుగా మనం ఉద్యుక్తమైనట్లే కదా? ఇదేనా నిష్పక్షపాత పాత్రికేయం? అయినా ఇప్పుడు నిష్పక్షపాత పాత్రికేయం గురించి మాట్లాడుకునే రోజులు ఉన్నాయా? అందుకు ఊతమిచ్చే యాజమాన్యాలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నా ఆ యాజమాన్యాలను స్వేచ్ఛగా ఉంచే పరిస్థితులు ఉన్నాయా?

పాత్రికేయ పాతివ్రత్యాన్ని కొందరు పెద్దలు వైస్రాయ్ హోటల్ సాక్షిగా విక్రయించినపుడే, కలాలు కులాల ప్రాతిపదికన విభజించినపుడే పరిస్థితి దారి తప్పిందనే వాదనలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కిరాయి కలాల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. శేఖర్ గుప్తా అనే ప్రముఖ పాత్రికేయుడు ఏపీ రాజధాని గురించి, జగన్ పాలన గురించి 20 నిమిషాల వీడియో పెట్టిన అంశంపై ‘సోకాల్డ్’ జర్నలిస్టు కలాలు ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కదా? ఇందులో అనేక మంది సత్యహరిశ్చంద్రుని వారసుల మాదిరిగా ఫోజులిస్తున్నారు కదా? అందుకే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
నిజమే పాత్రికేయులకు ప్రమాణాలు ఉండాలి. కలాలకు విలువలు ఉండాలి. తనకు తానే వలువలూడ్చుకున్న పాత్రికేయం వ్యభిచారానికి ఏమాత్రం తీసిపోదనే సమాజపు వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకోక తప్పదు. ఇందులోఎటువంటి సందేహం కూడా అక్కర లేదు. శేఖర్ గుప్తా వాదన తప్పా? ఒప్పా? టీడీపీ స్క్రిప్ట్ నే శేఖర్ గుప్తా చదివారనే కొందరి అభిప్రాయాలను కాసేపు పక్కన పెట్టండి. పాత్రికేయ విలువల గురించి ప్రస్తుతం డీజే సౌండ్ తరహాలో మాట్లాడుతున్నవారేమీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాథ్ గోయెంకాలు ఏమీ కాదు. వృత్తిపరంగా ఆయనకు వారసులు అంతకన్నా కాదు.

ఎక్కడో ఢిల్లీకి చెందిన శేఖర్ గుప్తా పాత్రికేయం గురించి ఎందుకు? మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పాత్రికేయులు పాటిస్తున్న విలువల గురించే కాసేపు మాట్లాడుకుందాం. ఒకానొక పెద్దాయన గతంలో ఏం రాతలు రాశారో గుర్తుంది కదా? ‘చంద్రబాబునాయుడిని ప్రధానిగా చూడాలని ఉంది’ అనే కోరికను తన రాతల్లో వ్యక్తం చేయలేదా? అదే పెద్దాయన కలాలకు సంకెళ్లు వేస్తూ వెలువడిన జీవో గురించి నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం కళ్లముందు సాక్షాత్కరించడం లేదా? తమకు లభించిన ‘భుక్తి’ పదవుల సాక్షిగా ఆ జీవోల సమర్థింపునకు తెగించిన దాఖలాలు లేవా? చంద్రబాబును ప్రధానిగా చూాడాలనే కోరిక నుంచి ‘కలం’ తిరగేసి రాసిన రాతల గురించి తెలియదా?

ప్రతీకాత్మక చిత్రం

ఇంకో పేరు మోసిన ప్రముఖ ‘కలం’ గురించి కాసేపు మాట్లాడుకుందాం. సూర్యాపేట నుంచి మాదాపూర్ వరకు తన ‘కులం’ కలాలకు మాత్రమే తన సంపాదకత్వంలోని పత్రికలో రిపోర్టర్లుగా అవకాశం కల్పించిన తీరు ఏ ప్రమాణాలకు తార్కాణంగా నిలుస్తోంది? ప్రతిభ ఉంటే ఫరవాలేదు…కానీ అక్షరం ముక్క రాయడం రానివారు.. నలుగురు రాతగాళ్లను తమ కింద పెట్టుకుని ‘ఘోస్ట్’ పాత్రికేయం సాగించేందుకు తన ‘కులానికి’ అవకాశం కల్పించిన తీరును ఏ విధంగాఅంచనా వేయాలి? ఇదేమిటని ప్రశ్నంచే తెగువ కనీసం ఆ పత్రిక యాజమాన్యానికి ఉందా? సదరు పత్రికలోని జర్నలిస్టుల కుటుంబానికి తండ్రిలా వ్యవహరించాల్సిన సంపాదకుడే అబద్ధాలాకోరుగా మారితే అతని తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ఫోన్ కాల్ లిస్ట్ తీయించడానికి సిద్ధమేనా? అని రాజీనామా కాగితాన్ని మొహాన విసిరేసిన జర్నలిస్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సంపాదకుడు విలువల గురించి మాట్లాడితే ఎలా అర్థం చేసుకోవాలి?

సాధారణ కంట్రిబ్యూటర్లను బదిలీ చేయడానికి తెగించిన ‘నెట్ వర్క్’ ఇంచార్జ్ ల ‘నీతి’ ఏమిటో కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? కంట్రిబ్యూటర్లు పత్రికల్లో ఉద్యోగులు కాదుగా… బదిలీ చేయడానికి? నెలసరి మామూళ్లు వసూళ్లు చేసి పెట్టడం లేదనే అక్కసుతో కంట్రిబ్యూటర్లను సుదూరు ప్రాంతాలకు బదిలీ చేస్తున్నా ‘నెట్ వర్క్’ ఇంచార్జిలను వెనకేసుకువస్తూ, తమకేమీ తేలియదన్న చందంగా వ్యవహరిస్తున్న ఒకానొక సంపాదకుని తీరును నేటి తరం పాత్రికేయులు ఎలా భావించాలి?

రిపోర్టింగ్ విభాగంతో నేరుగా సంబంధం లేని మఫసిల్ ఎడిటర్ బాధ్యతల్లోగల పాత్రికేయుడొకరు ‘అప్పు’ రూపేణా బ్యూరో ఇంచార్జిని లక్ష నగదును అడిగితే ఎలా అర్థం చేసుకోవాలి? ఆ లక్ష తన దగ్గర లేవని సదరు ఇంచార్జ్ సమాధానం చెబితే… ‘నీ రాతలు చూసి బాగా సంపాదిస్తున్నావని భావిస్తున్నాను’ అని సదరు మఫసిల్ ఎడిటర్ చేసిన వ్యాఖ్యలను ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇటువంటి అనైతిక చర్యలకు నిత్యం పాల్పడుతున్న వారిని వెనకేసుకువచ్చే సంపాదకున్ని ఏమని పిలవాలి?

ఇలా చెప్పుకుంటూ వెడితే ఉదాహరణలు కోకొల్లలు. ఉద్యమ కుటుంబం నుంచి వచ్చామని జబ్బలు చరుచుకుంటే సరిపోదు. ‘పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన’ చందంగా తమనెవరూ చూడడం లేదని భావిస్తే కుదరదు. ఎక్కడో ఢిల్లీలో గల శేఖర్ గుప్తా రాతల గురించే కాదు, స్థానికంగా ఇప్పట్లోనే కాదు ఇక ముందెన్నడూ శుద్ధి చేయలేని కొందరి ‘రోత’ పాత్రికేయం గురించి కూడా సందర్భానుసారం మాట్లాడుకోవలసి ఉంటుంది. మొత్తంగా చెప్పేదేమింటంటే తాము శుద్ధ పూసలైనప్పుడు మాత్రమే ఇతరులకు నీతి చెప్పాలని.. ఇక్కడెవరూ పత్తిత్తులు లేరని..నీతులు వల్లిస్తున్న వీళ్ల ‘గుప్త’ చరిత్ర ఎప్పటికీ చెరపలేనిదని… ఇది సశేషం మాత్రమేనని..ఇప్పటికిది చాలునని…!

Comments are closed.

Exit mobile version