ములుగు జిల్లాలో పులి చర్మం పట్టుబడింది. ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనూహ్యంగా పులి తోలు లభ్యం కావడం గమనార్హం. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు విఫలయత్నం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… గురువారం ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్ళ కట్ట బ్రిడ్జి వద్ద అమ్మడానికి సిద్ధంగా ఉన్న పులి చర్మం కలిగి ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వాజేడుకు చెందిన తిరుమలేష్, ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా చండూరుకు చెందిన సత్యం అనే వ్యక్తుల నుంచి పులి చర్మం,హీరో స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ ఒకటి చొప్పున స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలేష్ అనే వ్యక్తి తరచుగా ఛత్తీస్ గఢ్ లోని తన బావ సాగర్ ను నాలుగు సంవత్సరాల నుండి కలుస్తూ ఉండేవాడు. నెల రోజుల క్రితం సాగర్ ఫోన్ చేసి తన వద్ద పులిచర్మం ఉందని. దాన్ని అమ్మడానికి సహాయం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో పులి చర్మం కొనేవారిని వెతికి పెట్టాలని కోరాడు. అనంతరం తిరుమలేష్ ఓ వ్యక్తిని సంప్రదించగా అతను తెలంగాణ రాష్ట్రం నుండి 30 లక్షల రూపాయలకు పులి చర్మం కొనడానికి వేరే అతను సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఈ వివరాలు తిరుమలేష్ సాగర్ కు చెప్పగా పులి చర్మం తిరుమలేష్ కు ఇచ్చాడు. తిరుమలేష్ ఈ పులి చర్మాన్ని సత్యం ఇంట్లో దాచి పెట్టాడు. అనంతరం దానిని అమ్మడానికి తిరుమలేష్, సత్యం ముళ్ళ కట్ట బ్రిడ్జి వద్దకు రాగా ఏటూరునాగారం పోలీసులు ఆయా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
విషయంపై ఏటూరునాగారం సీఐ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, ఇన్ఛార్జ్ ఎఫ్ డి ఓ గోపాల్ రావు ఇతర అధికారులు పులి చర్మాన్ని పరీక్షించి నిజమైన పులి చర్మంగా నిర్ధారించారు. అనంతరం అటవీ సంరక్షణ చట్టం-1972 ప్రకారం అధికారుల సమక్షంలో స్వాధీన పంచనామా నిర్వహించారు. త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామమని, ప్రస్తుతం దొరికిన నిందితులపై అటవీ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.