‘గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల పేర్లను అదే రోజు వెల్లడిస్తాం. ఈనెల 11న వాళ్ల పేర్లు నేనే స్వయంగా పేపర్ మీద రాసి సీల్డ్ కవర్ ద్వారా పంపిస్తా. ఆ రోజు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా ఉదయం 9 గంటలకకు తెలంగాణా భవన్ కు రావాలి. ఇక్కడి నుంచి జీహెచ్ఎంసీ సమావేశపు హాలుకు వెళ్లాలి. అక్కడికి చేరుకున్నాకే సీల్డ్ కవర్ ను తెరవాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ తోపాటు నగర మంత్రులు పర్యవేక్షిస్తారు’ ఇవీ ఈనెల 7న జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.
ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేని జీహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి దక్కుతాయి? అదెలా సాధ్యం? అనే ప్రశ్నలకు తావు లేదు. ఎందుకంటే ఆయా పదవులను దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ తో పనిలేదు. సమావేశానికి హాజరైన సభ్యుల్లో మెజారిటీ ఉంటే చాలు. ఎక్స్ అఫీషియో సభ్యులు సహా టీఆర్ఎస్ బలం 88 మంది కాగా, బీజేపీ 49, ఎంఐఎం 54, కాంగ్రెస్ ఇద్దరు సభ్యుల చొప్పన జీహెచ్ఎంసీలో బలాన్ని కలిగి ఉన్నారు. బలాబలాలు, తాజా రాజకీయ సమీకరణలు తదితర అంశాల కారణంగా ఏ పార్టీకి, మరే పార్టీ బాహాటంగా ఈ పదవుల ఎన్నికలో మద్ధతిచ్చే అవకాశాలు లేవు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తదితర అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నట్లు రాజకీయ పరిశీలకుల భావన. ఇంతకీ మేయర్ ఎవరు? డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరిస్తుందనేది అసలు ప్రశ్న కానేకాదు.
కానీ సీఎం కేసీఆర్ మూడు రోజుల క్రితం ఏం చెప్పారనే అంశంపైనే చర్చ జరుగుతోంది. సీల్డ్ కవర్ ‘సంస్కృతి’పై కేసీఆర్ గతంలో పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఈ తరహా ‘సంస్కృతి’కి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతగా ప్రాచుర్యం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా పలు ఎన్నికల్లో సీల్డ్ కవర్ ‘సంస్కృతి’ని అనుసరించిన దాఖలాలు ఉన్నాయి. కానీ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ శైలి వేరు కదా? ఉద్యమ పార్టీ నుంచి పూర్తి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినప్పటికీ పార్టీలో కేసీఆర్ చెప్పిందే వేదం. ఆయన మాటే శాసనమని పార్టీ నేతలు చెబుతుంటారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనూ ఈ విషయం రుజువైంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్లు నిరాకరించినా కేసీఆర్ ను ప్రశ్నించే సాహసానికి ఏ నాయకుడూ దిగలేదు. ‘నీకు టికెట్ ఇవ్వడం లేదు’ అని కేసీఆర్ ముందుగానే వెల్లడించినా ఇప్పటికీ ఆయన నిర్ణయమే శిరోధార్యమని పరమ వీర భక్తిని చాటుతున్న ‘మాజీ’లుగా మారిన నేతలు ఉన్నారు.
కానీ తొలిసారి సీఎం కేసీఆర్ సీల్డ్ కవర్ ‘సంస్కృతి’ని జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికలో పాటిస్తుండడమే విశేషం. ఈ సీల్డ్ కవర్ ‘సంస్కృతి’ని గతంలో దునుమాడిన కేసీఆర్ అదే ‘సంస్కృతి’ని అనుసరించడమేంటి? ఇదీ పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ. ఇంతకీ ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారో తెలుసా?
‘జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లు పార్టీ మారుతారనే సంకేతాలు ఉన్నాయా? మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు ముందుగా ప్రకటించడానికి కూడా భయపడే స్థితికి టీఆర్ఎస్ చేరుకుందా? లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్ కవర్ లో ఎందుకు పంపాలి?’ అని నెటిజన్లు అంటున్నారు.