మరీ గడుసు పిల్లోడులా ఉన్నాడు. కాకపోతే ఏంటండీ? ఓ ఎమ్మెల్యే బుగ్గను అలా గిల్లేసి ముద్దు పెట్టుకోవడం ఏమిటి? గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి ఎదురైన వింత అనుభవం ఇది. తన నియోజకవర్గంలోని ఓ స్కూల్లో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యే రజని తనకు ఎదురైన వింత అనుభవానికి ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ఎమ్మెల్యే రజని కాసేపు సరదాగా గడిపారు.
అనంతరం విద్యార్థులను పలకరిస్తూ, వారికి వరుసగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి ఆమె బుగ్గను గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే రజని వెంటనే తేరుకున్నారు. విద్యార్థి చేష్టను సరదాగా తీసుకుని నవ్వుతూ ముందుకు కదిలారు. ఇంతకీ రజనీ ఎవరో పూర్తిగా చెప్పలేదు కదూ? గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించారు. ఎమ్మెల్యే రజని బుగ్గ గిల్లిన విద్యార్థి వీడియో సోషల్ మీడియాలో ఒకటే చక్కర్లు కొడుతోంది.