‘దిశ’ మీటింగులో ఓ ఎమ్మెల్యే మరో హెడ్ మాస్టర్ పై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష కోసం నిర్దేశించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ఓ స్కూలు హెడ్ మాస్టర్ పై పలు ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం, విచారణకు దిశ కమిటీ చైర్మెన్ ఆదేశించడం విశేషం. దిశ కమిటీకి స్థానిక ఎంపీ చైర్మెన్ గా వ్యవహరిస్తుంటారు. ఈమేరకు ఖమ్మం జిల్లా జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ రఘురాంరెడ్డి అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ లో జరిగింది.
ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెడ్ మాస్టర్ కు అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసి, సస్పెన్షన్ కు గురైన హెడ్మాస్టర్ ను అదే పాఠశాలలో ఎలా పోస్టింగ్ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసిన తన అభిప్రాయం అడగకుండా విచారణ రిపోర్టు ఎలా రూపొందించారని నిలదీశారు. అదే హెడ్ మాస్టర్ నేడు పిల్లలతో సొంత పనులు చేయిస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు రాగమయి ఆరోపించారు.
అదేవిధంగా సత్తుపల్లిలో మంజూరు చేసిన ఆసుపత్రి నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. పనులు పూర్తి చేయడంలో ఆలస్యంచేస్తున్న కాంట్రాక్టర్ కు నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ఎలా అప్పగించారని, సింగల్ టెండర్ ఎలా అనుమతి ఇస్తున్నారని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు.
ఆయా అంశాలపై ‘దిశ’ కమిటీ చైర్మెన్, ఎంపీ రఘురాంరెడ్డి స్పందిస్తూ, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ఫిర్యాదు ప్రకారం సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ పై వేరే మండలాలకు చెందిన అధికారులతో విచారణ నిర్వహించాలని ఆదేశించారు. విచారణ నివేదికను నేరుగా జిల్లా కలెక్టర్, ఎంపీకి అందజేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడే సిబ్బంది, అధికారులను ఉపేక్షించేది లేదని ఎంపీ అన్నారు. సత్తుపల్లిలో మంజూరైన ఆసుపత్రులలో సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై ఉన్నతాధికారులకు కలెక్టర్ ద్వారా నివేదిక సమర్పించాలని కూడా ఎంపీ సూచించారు.