సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కార్టూన్ ఇది. బహుషా ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ సందర్భంగా కార్టూనిస్టు గీసిన వ్యంగ్య చిత్రం కాబోలు. మన చేతిలో ‘ప్రెస్’ అనే అస్త్రంతో, నోరేసుకుని ఇతరులపై పడిపోయే జర్నలిజం చేస్తూ, వేధించి, వేపుకు తింటే, తనదాకా వచ్చినపుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు కార్టూనిస్టు. వ్యంగ్యచిత్రాల శైలిలో బాగా పేలిన కార్టూన్ ఇది అని చెప్పవచ్చు. ఇప్పుడు దిగువన గల సోషల్ మీడియా పోస్టును ఓసారి చూడండి.
తెలంగాణాకు చెందిన ఓ మంత్రి ఇటీవల ‘రాసలీలల’ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే కదా? ఆయా అంశంలో స్థానిక జర్నలిస్టులు కిక్కురుమనడం లేదట. అక్షరం ముక్క రాసిన పాపాన పోలేదట. ఎందుకంటే మంత్రిగారి ఇలాఖా కేంద్రంలో పనిచేసే పలువురు జర్నలిస్టులకు ప్రతిరోజూ పండగేనట. కొందరు జర్నలిస్టులు తిరుగుతున్న బుల్లెట్లు మంత్రిగారు ఇచ్చిన బహుమతులేనట. ‘రాసలీలల’ వివాదాన్ని రాయకుండా ఉంటే మనకూ ఇస్తాడో విమానం’ అనే భావన స్ఫురించే విధంగా ఇలా సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు. ఇవన్నీ స్థానిక, జాతీయ ముచ్చట్లు. ఇక అంతర్జాతీయ అంశాన్ని ఓసారి చూద్దాం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించకుండా ఇంకా ‘తొండి’వాదన చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాాజా ప్రవర్తన తాలూకు వార్తల గురించి తెలిసిందే కదా? ‘మిస్టర్ ప్రెసిడెంట్’ హోదాలోనే ఆయన ప్రసంగిస్తుండగా, అబ్బే… అధ్యక్షుడు అన్నీ అబద్ధాలే చెబుతున్నారంటూ అక్కడి మీడియా ఛానళ్లు మధ్యలోనే ‘లైవ్’ కట్ చేశాయట. ట్రంప్ చెబుతున్న మాటలకు ఆధారాల్లేవ్… అంటూ అర్థంతరంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి మరీ ట్రంప్ ఇజ్జత్ తీసినంత పనిచేశాయట. ట్రంప్ నోట అబద్దాలనే విషయాన్ని యాంకర్లు ‘లైవ్’లోనే చెప్పేశారట కూడా.
అయితే ఏంటట అంటారా? అమెరికా మీడియా ధైర్యం, తెగువ మన మీడియాకు, ముఖ్యంగా తెలుగు మీడియాకు ఉన్నాయా? అని ఆయా వార్త క్లిప్పింగు సహా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు ఓ కామ్రేడ్. మన దగ్గర లేచింది తడవు పుట్టెడు అబద్ధాలు చెప్పే కొందరు నాయకుల ప్రసంగాలను మధ్యలోనే ఆపే ధైర్యం మన మీడియాకు ఉందంటారా…!?