ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలిసింది. ఈ స్థానం నుంచి టికెట్ కోసం అనేక మంది ఉద్దండులు పోటీ పడినప్పటికీ, పార్టీ అధిష్టానం తీవ్ర వడపోతల అనంతరం టికెట్ పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డాక్టర్ మట్టా దయానంద్ సతీమణి మట్టా రాగమయికి టికెట్ కేటాయిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడ తాను సూచించిన కొండ్రు సుధాకర్ కు టికెట్ ఇప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శతవిధాలుగా ప్రయత్నం చేశారు. అయితే సర్వే నివేదికలు, ఇతరత్రా పలు సమీకరణల నేపథ్యంలో మట్టా రాగమయి అభ్యర్థిత్వంవైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వివిధ స్థాయి నేతల చివరి ప్రయత్నాలు ఫలిస్తే తప్ప మట్టా రాగమయి అభ్యర్థిత్వం అంశంలో ఏ మార్పూ ఉండకపోవచ్చని రూఢీగా తెలుస్తోంది. మట్టా దయానంద్ లేదా రాగమయికి టికెట్ రాకుంటే బాగుండని ప్రత్యర్థులు కొందరు ఆశిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. నేడో, రేపో కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఫొటో: డాక్టర్ మట్టా దయానంద్, రాగమయి దంపతులు