మద్యం షాపులకు ప్రభుత్వం బార్లా తెరిచింది. కానీ మద్యం విక్రయాల్లో ఇలా జరుగుతోందేమిటి? పరిస్థితి ఇలా మారిందేమిటి? నలభై డిగ్రీలను దాటి ఎండలు దంచి కొడుతున్నప్పటికీ మద్యపాన ప్రియులు ‘చిల్డ్’ బీర్లవైపు చూడడం లేదెందుకు? ఇవీ వైన్ షాపు యజమానుల తాజా సందేహాలు.
ఈ వేసవిలో మద్యం విక్రయాలకు సంబంధించి పరిస్థితి తిరగబడినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో లిక్కర్ విక్రయ గణాంకాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచిన సంగతి తెలిసిందే. మందుబాబులు పోటీలు పడి మరీ మద్యం కొనుగోలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో భౌతిక దూరాన్ని కూడా పాటించని సీన్లు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ వేసవి సీజన్లో బీర్లకు బాగా గిరాకీ ఉంటుందనేది వైన్ షాపు నిర్వాహకుల వాదనే కాదు వాస్తవం కూడా. బీర్లు దొరకని పరిస్థితుల్లో లిక్కర్ షాపుల ముందు గతంలో ఘర్షణలు చోటు చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం బీర్లకన్నా విస్కీ, బ్రాందీలకే మద్యపాన ప్రియులు ప్రాధాన్యతనిస్తున్నారు.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణా వ్యాప్తంగా శనివారం నాటికి రూ.200 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. కానీ బీర్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియడం లేదని వైన్ షాపుల నిర్వాహకులు వాపోతున్నారు. వాస్తవానికి బీర్ల స్టాకు విరివిగానే ఉన్నప్పటికీ అవి ఎందుకు అమ్ముడుపోవడం లేదో తెలియక తలలు నిమురుకుంటున్నారట.
ఇంతకీ ‘చిల్డ్’ బీర్లవైపు లిక్కర్ బాబులు ఎందుకు లుక్కేయడం లేదో తెలుసా? లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో మళ్లీ ఎప్పుడు ఎటువంటి పరిణామాలు నెలకొంటాయో? వైన్ షాపులు మళ్లీ బంద్ చేయరని గ్యారంటీ ఏంటి? బీర్లు తీసుకువెడితే నిల్వ చేయడం కూడా ఇబ్బందే. అందులోనూ సామాన్యులకు ఫ్రిజ్ సౌకర్యం ఉండకపోవచ్చు. ఇటువంటి ఆందోళన మందుబాబులను వెంటాడుతోందట.
అందుకే ‘మందు’ జాగ్రత్తగా… ముందు చూపుతో బీర్ల వైపు చూడడం లేదట. బ్రాందీ, విస్కీలైతే ‘స్టాకు’ పెట్టుకునే అవకాశం ఉన్నందునే బీర్ల విక్రయాలు భారీగా పడిపోయాయట. ఎండలు మండుతున్నా వేడి వేడి సరుకుకే ప్రాధాన్యత ఇస్తున్నారట. అదీ సంగతి.