ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఒకటిగా భావిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యం చేసిన ప్రకటన ఇది. తన పత్రికలోనే కాదు సోషల్ మీడియాలోనూ సాక్షి సిబ్బంది స్వయంగా ప్రచారం చేసుకుంటున్న వినూత్న ప్రచారమిది. ఇందులో ‘సాక్షి’ యాజమాన్యం చెబుతున్నదేమిటి? ‘మీరే మా బలం.. మీ భద్రతే మాకు ముఖ్యం… లాక్ డౌన్ లో అమ్ముడైన కాపీలు అంటూ… 3 కోట్ల 78 లక్షల 91 వేల 174 సంఖ్యను ప్రస్తావిస్తూ, తన పాఠకులకు ధన్యవాదాలు తెలుపుతూ పబ్లిష్ చేసిన అడ్వర్టయిజ్మెంట్ ఇది.
పత్రికలకూ ప్రచారం అవసరమే. సొంత డబ్బాగా భావించినా, మరే విధంగా అన్వయించినా తన గురించి తాను చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చినట్లుంది. తమ ఘనత గురించి ఇతరులకు తెలియకపోయినా ఓ రకంగా ఇబ్బందేనని ఓ మిత్రుడు ఇటీవలే నిర్వచించారు కూడా. దాని సంగతలా ఉంచితే… ఇంతకీ ఈ ప్రకటన ద్వారా ‘సాక్షి’ చెప్పిన అంశమేమిటన్నదే అసలు చర్చగా మారింది.
ఎందుకంటే…? పత్రికల సత్తాను తెలియజేసేందుకు ‘ఏబీసీ’ సర్టిఫికెట్ ఉంటుంది. ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ఆ సంస్థ ఇచ్చే ధృవపత్రం. ప్రతి ఆర్నెళ్లకోసారి పత్రికల సర్య్కులేషన్ ను ఏబీసీ ప్రకటిస్తుంది. ముంబయి కేంద్రంగా పనిచేసే ఏబీసీ సంస్థ పత్రికల ఎడిషన్ సెంటర్లను తనఖీ చేసి, ప్రింట్ ఆర్డర్, తదితర అంశాలను నిశితంగా పరిశీలించి సర్టిఫికెట్ ఇస్తుంది. దీని ఆధారంగానే పత్రికలకు యాడ్స్ రూపంలో ఆదాయం లభిస్తుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ వాణిజ్య ప్రకటనల జారీకి ఏబీసీ సర్టిఫికెట్ నే ప్రామాణికంగా భావిస్తుంటాయి కూడా.
కొన్ని పత్రికల సంస్థలు అసలు ‘ఏబీసీ’ దరిదాపుల్లోకి కూడా వెళ్లవు. వెడితే అసలు సర్య్కులేషన్ బహిర్గతమై తమ సత్తా ఏమిటో పాఠకులకు తెలిసిపోతుందనేది కొన్ని యాజమాన్యాల బెరుకు. ఏబీసీ సర్టిఫెకెట్ మాత్రమే కాదు ఇండియన్ రీడర్ షిప్ సర్వే (ఐఆర్ఎస్) కూడా పత్రికల బలాన్ని బేరీజు వేస్తుంది. సదరు పత్రికను ఎంత మంది పాఠకులు చదువుతున్నారనేది ఐఆర్ఎస్ తన సర్వే ద్వారా వెల్లడిస్తుంది. అటు ఏబీసీ, ఇటు ఐఆర్ఎస్ సర్వే అంశాలను దేశంలోని ప్రింట్ మీడియా సంస్థలు స్వయంగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటాయి.
కానీ ‘సాక్షి’ తాజాగా ప్రచురించిన ఈ ప్రకటన కాస్త అయోమయంగా ఉండడమే పాఠక లోకంలో చర్చకు తావు కల్పించింది. ‘లాక్ డౌన్’లో అమ్ముడైన కాపీలుగా పేర్కొంటూ 3.78 కోట్ల సంఖ్యను బహిర్గతం చేశారు. అయితే ఇది ఏ ప్రామణికం ప్రకారం…? అనే అంశాన్ని మాత్రం సాక్షి తన ప్రకటనలో స్పష్టీకరించలేదని పాఠక వర్గాల అభిప్రాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సంఖ్యతో కూడిన ప్రకటనను పబ్లిష్ చేయడం గమనార్హం.
లాక్ డౌన్ సమయంలో అంటే గడచిన మూడు నెలల కాలంలో ‘సాక్షి’ 3.78 కోట్ల ప్రతులను విక్రయించినట్లు చెబుతోంది. అంటే ఈ సంఖ్య రెగ్యులర్ పాఠకులకు సంబంధించినదా? లేక లూజ్ సేల్సా? అనే అంశాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఇవేవీ కావని, ‘ఈ-పేపర్’ డౌన్లోడ్ సంఖ్యగా భావిద్దామా? అంటే ఆ విషయాన్నీ పేర్కొనలేదు. లాక్ డౌన్ పీరియడ్ నుంచి అంటే గత మార్చి మూడో వారం నుంచి ప్రస్తుత జూన్ మూడో వారం వరకు దాదాపు 90 రోజుల కాలంలో విక్రయించిన ప్రింట్ కాపీలుగా భావిస్తే దాని లెక్కలు వేరేగా ఉంటాయి.
ఆయా ప్రాతిపదికన మొత్తం 90 రోజులకు 3,78,91,174 కాపీలను భాగిస్తే సాక్షి దినసరి సర్క్యులేషన్ 4,21,013 కాపీలు మాత్రమే అవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి సాక్షి సర్క్యులేషన్ లాక్ డౌన్ సమయంలో 4.21 లక్షలేనా? అంటే లాక్ డౌన్ పీరియడ్ లో సాక్షి సర్క్యులేషన్ తగ్గినట్లా? పెరిగినట్టా? పోనీ లూజ్ సేల్స్ గా భావిద్దామా అంటే… దినసరి 4.21 లక్షల లూజ్ సేల్స్ కాపీలను లాక్ డౌన్ పీరియడ్ లో విక్రయిస్తే ఓ పత్రికకు అంతకన్నా క్రెడిబిలిటీ మరొకటి ఉండదు. ఇదే అంశాన్ని జాకెట్ యాడ్ రూపంలో ఘనంగా ప్రకటించుకోవచ్చు కూడా.
అందువల్ల మొత్తంగా చెప్పేదేమిటంటే ‘సాక్షి’ చేసుకున్న ఈ స్వయం ప్రకటనలో స్పష్టత లేదు. అసలు ఈ సంఖ్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటనలో పొందుపరిస్తే విశ్వసనీయతకు మరింత ప్రామాణికం, బలం చేకూరేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో తన పాఠకులకైనా స్పష్టతనివ్వాల్సిన బాధ్యత సాక్షి యాజమాన్యానికి ఉందనేది నిర్వివాదాంశం.