తెలంగాణా రాష్ట్రంలో గులాబీ బాస్… అదేనండీ… టీఆర్ఎస్ పార్టీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవరం పుట్టించే నాయకుడెవరైనా ప్రస్తుతం కనుచూపు మేరలో ఉన్నారా? విపక్ష పార్టీలకు చెందిన నేతల సంగతి వదిలేయండి. స్వపక్షంలోనే టీఆర్ఎస్ పార్టీలో ‘గుబులు’ కలిగించే నాయకుడు ఉన్నారా? కేసీఆర్ ముందు ధిక్కార స్వరం వినిపించే సత్తా గల ఆ నాయకుడెవరు?
‘బిడ్డా… ఏమనుకుంటున్నావో…? మేం కిరాయిదార్లం కాదు… గులాబీ జెండా ఓనర్లం’ అంటూ ఎవరి పేరునూ ఉచ్ఛరించకుండా నర్మగర్భంగా గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటెల రాజేందర్ వంటి నాయకులూ ప్రస్తుతం గమ్మున ఉన్నారు కదా?
ఇటువంటి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ పార్టీలో ప్రశాంతత లేకుండా చేయగలిగే నాయకులు మరెవరైనా ఉన్నారా? ఔననే చెబుతోంది ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రచురించిన ఓ వార్తా కథనం. డౌటుందా? అయితే ‘సాక్షి’ వెబ్ లైట్లో నిన్న రాత్రి 7.24 గంటలకు పబ్లిష్ చేసిన ఈ వార్తా కథనాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఓసారి చదవండి. తర్వాత అసలు విషయంలోకి వెడదాం.
‘ప్రశాంతంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రకంపనలు రేపుతున్నారు. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించడం గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షితో ముచ్చటించిన స్వామిగౌడ్ టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆగ్రహం చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి హేళన చేసిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని తెలిపారు. ఉద్యమ సమయంలో వెన్నంటి ఉండి నడిచిన వారికి కూడా కలిసే సమయం ఇవ్వకపోతే మరెవ్వరికి ఇస్తారని టీఆర్ఎస్ బాస్‌పై కొపగించుకున్నారు. అయితే ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్ తనకు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తన స్థానంలో మరొకరికి టికెట్ కేటాయించారని గుర్తుచేశారు.
పార్టీ కార్యకలాపాలకు దూరంగా..
గతేడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్ కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయిన స్వామిగౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీకి ఆసక్తి చూపినా అవకాశం లభించలేదు. ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆశించినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.’
చదివారు కదా? అదీ ‘సాక్షి’ మీడియా గ్రూపునకు చెందిన వెబ్ సైట్ కథనం. ఈ వార్తా కథనానికి ‘సపోర్ట్’గా సాక్షి టీవీలో ప్రసారం చేసిన సుమారు 5.21 నిమిషాల నిడివి గల వీడియో క్లిప్ వార్తా కథనాన్ని కూడా జోడించడం గమనార్హం.
‘ప్రశాంతంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీలో శాసన మండలి చైర్మెన్ స్వామి గౌడ్ ప్రకంపనలు రేపుతున్నారు. రేవంత్ పై స్వామిగౌడ్ కురిపించిన ప్రశంసలు గులాబీ దళంలో గుబులు రేపుతోంది. అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బాస్ పై కోపగించుకున్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. గత ఎన్నికల్లో స్వామిగౌడ్ రాజేంద్రనగర్ నుంచి అసెంబ్లీ టికెట్ ను కూడా ఆశించారు. ఏదేని కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆశించినా అధిష్టానం నుంచి స్పందనం లేకపోవడంతో స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.’
అలా సాగింది ‘సాక్షి’ వార్తా కథనం. ఇంతకీ స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపడానికి, కేసీఆర్ పై కోపగించుకోవడానికి కారణాలను కూడా ‘సాక్షి’ కథనం చెప్పకనే చెప్పింది. చివరికి కార్పొరేషన్ పదవి ఆశించినా అధిష్టానం నుంచి స్పందన లేకపోవడం వల్లే స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు కూడా ఈ వార్తా కథనంలో ‘సాక్షి’ తేల్చేసింది.
మొత్తంగా చెప్పే అంశమేమిటంటే… జర్నలిజంలో సందర్భానుసారం, అనుయాయులకోసం, ఆప్తులకోసం అప్పుడప్పుడూ ‘ప్లాంటెడ్ న్యూస్ స్టోరీ’లు ఉంటాయని సీనియర్లు చెబుతుంటారు. పార్టీల వారీగా పత్రికల విభజన తేలిపోయాక అనేక అంశాల్లో ఈ విషయం తేటతెల్లమైంది కూడా.
కానీ కేసీఆర్ సర్కారుతో సన్నిహిత సంబంధాలు పుష్కలంగా గల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ‘సాక్షి మీడియా గ్రూపు’లో ప్రచురితమైన ఈ తరహా వార్తా కథనాన్ని గులాబీ శ్రేణులు ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే స్వామిగౌడ్ వ్యాఖ్యలు అధికార పార్టీలో గుబులు రేపుతున్నాయా? లేక స్వామిగౌడ్ హితాన్ని కోరుతూ, ఆయనకు సన్నిహితంగా మెలిగేవారెవరైనా ‘సాక్షి’లో కీలక బాధ్యతల్లో ఉన్నారా?
ఇదీ టీఆర్ఎస్ శ్రేణుల అసలు సందేహమట. ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఈ అంశంపై వివరాలు సేకరిస్తున్నట్లు గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. అదీ అసలు విషయం.