పత్రికలు ప్రారంభించే సమయంలో వాటి యాజమాన్యాలు మస్త్ ప్రవచనాలు వల్లిస్తుంటాయి. ఎవరి పని వాళ్లే చేయాలని ఆయా పత్రికల ముఖ్య బాధ్యులు సూక్తీకరిస్తారు. ఒకరి డిపార్ట్మెంటులో మరొకరు వేలు పెట్టకూడదని గట్టిగానే నిర్దేశిస్తుంటారు. కానీ కాలం గడిచేకొద్దీ తాము ప్రవచించిన ధర్మసూత్రాలకు పలు యాజమాన్యాలు తిలోదకాలిస్తుంటాయి. అనేక పత్రికల్లో అనేక సందర్భాల్లో, మరెన్నో సమయాల్లో ఇది రుజువైంది కూడా. దాదాపు అన్ని పత్రికల్లోనే ఇదే తంతు. జర్నలిస్టు అనేవాడు అసలు విద్యుక్త ధర్మాన్ని మరచి దశాబ్ధాలు కావస్తున్నట్టుంది కూడా. ఇంతకీ విషయమేమిటంటే…?
మొన్నా మధ్య ‘నమస్తే తెలంగాణా’ దినపత్రిక యాజమాన్యం తన విలేకరులకు ఓ ‘బంపర్ ఆఫర్’ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా? ‘మీ సంపాదన నెలకు రూ. 45 వేలు’ అంటూ యాడ్స్, సర్క్యులేషన్ భారాన్ని విలేకరిపై మోపుతూ ఈ ‘సదవకాశం’ ఇచ్చారు. ఓ లక్ష యాడ్ రూపంలో మాకు రెవెన్యూ తీసుకురండి, రూ. 15 వేల కమిషన్ గా పొందండి. నెలకు ఓ వంద కాపీలకు సంవత్సర చందాలు కట్టించండి. రూ. 30 వేలు నెలాఖరు నాటికి మీ అకౌంట్లో పడతాయి… అని నమస్తే తెలంగాణా పత్రిక తన విలేకరులకు ఇచ్చిన బంపర్ ఆఫర్ బాపతు సారాంశం.
తాజా వార్త ఏమిటంటే ‘సాక్షి’ దినపత్రిక కూడా నమస్తే తెలంగాణా యాజమాన్యం దారిలోనే పయనించడం. ఒక్కో మండల విలేకరి నెలకు కనీసం అయిదు పత్రికలకు చందాలు కట్టించాలని, ప్రతి పత్రికకు వార్షిక చందా కింద రూ.1,200 వసూల్ చేయాలని నిర్దేశించింది. ఈ ప్రాతిపదికన పత్రిక సర్క్యులేషన్ పెంచినవారికి నగదు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఇరవై ఐదు కాపీలకు రూ. 1,000, యాభై కాపీలకు రూ. 2,000 వేలు, 75 కాపీలకు, రూ. 3,500, వంద కాపీలకు రూ. 5,000 వేల చొప్పన నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. రశీదు బుక్ కూడా సర్క్యులేషన్ విభాగానికి చెందిన సేల్స్ రిప్రజెంటేటివ్ తో పంపిస్తున్నామని, వెంటనే పని ప్రారంభించాలని అంతర్గత మెసేజ్ ద్వాారా సాక్షి ముఖ్య బాధ్యులు అందులో పనిచేసే విలేకరులను ఆదేశించారు.
అయితే సర్క్యులేషన్ పెంపుదల అనే ఫార్ములా ప్రతిపదికగా అటు నమస్తే తెలంగాణా, ఇటు సాక్షి యాజమాన్యాలు ఇచ్చిన ఈ ‘ఆఫర్’లలో గమంచాల్సిన కొన్ని విశేషాలు కూడా ఉన్నాయ్ మరి. నమస్తే తెలంగాణా పత్రిక వార్షిక చందా రూ. 1,600గా నిర్దేశించి, ఇందులో రూ. 300 మొత్తాన్ని రిపోర్టర్ కు కమిషన్ గా చెల్లించాలని నిర్ణయించారు. ఓ వంద కాపీలు బుక్ చేస్తే రూ. 30 వేలు అకౌంట్లో పడతాయన్నది ఈ ప్రాతిపదికనే.
కానీ సాక్షి పత్రిక సంవత్సర చందా రూ. 1,200 లుగా నిర్ణయించి, వంద కాపీలు బుక్ చేసినవారికి రూ. 5 వేలు నగదు ప్రోత్సాహకంగా ప్రకటించారు. అంటే నమస్తే తెలంగాణా రిపోర్టర్ వంద కాపీల కోసం కష్టపడి రూ. 1.60 లక్షల మొత్తాన్ని వసూలు చేస్తే రూ. 30 వేలు లభిస్తుండగా, సాక్షి విలేకరి రూ. 1.20 లక్షలు వసూలు చేస్తే లభించే నగదు ప్రోత్సాహకం కేవలం రూ. 5 వేలు మాత్రమే. ఈ వ్యత్యాసాన్ని బేరీజు వేసి పరిశీలించినపుడు నమస్తే తెలంగాణా పత్రిక తన విలేకరులకు ఇచ్చిన ‘బంపర్ ఆఫర్’ సాక్షికన్నా బెటర్ ఆప్షన్ గానే కనిపిస్తోంది కదూ?
ఈ రెండు పత్రికల వార్షిక చందాల మొత్తాలను మరింత లోతుగా పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. నమస్తే తెలంగాణా పాఠకుని నుంచి రూ. 1,600 వసూల్ చేయించి అందులో రూ. 300 చొప్పున తన రిపోర్టర్ కు కమిషన్ గా చెల్లిస్తోంది. సాక్షి మాత్రం రూ. 1,200 వసూల్ చేయించి గుండుగుత్తగా ఓ అయిదు వేల మొత్తాన్ని ప్రోత్సాహకంగా చెల్లిస్తోందన్నమాట. తద్వారా సాక్షికన్నా నమస్తే తెలంగాణా తన వార్షిక చందాలో పాఠకుని నుంచి రూ. 100 అదనంగా లాభాన్ని ఆర్జిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాకపోతే దీని యాజమాన్యం రిపోర్టర్ కు ఎక్కువ లబ్ధి చేకూరుస్తుండగా, సాక్షి మాత్రం పాఠకునికి రూ. 400 మొత్తం తక్కువకే సంవత్సరం పాటు పత్రికను అందిస్తున్నట్లు గ్రహించాలి.
మొత్తంగా వార్తలు రాయడమే కాదు రశీదు బుక్కు పట్టుకుని ఆయా పత్రికల విలేకర్లు ప్రస్తుతం సంవత్సర చందాల కోసం వేట ప్రారంభించాలి. ఔనూ…? కరోనా కల్లోల పరిణామాల్లోనూ టాబ్లాయిడ్స్ (జిల్లా అనుబంధాలు) పునఃప్రారంభించి సర్క్యులేషన్ పరంగా మరింత పుంజుకోవాలని, పోటీ పత్రికలను అధిగమించాలని వేసిన వ్యూహాలు బెడిసికొట్టినట్లేనా? రిపోర్టర్ల భుజాన సర్క్యులేషన్ భారాన్ని మోపుతూ నగదు ‘తాయిలాలు’ ప్రకటించడం దేనికి సంకేతంగా భావించవచ్చు? ‘నమస్తే… ఇందుకు మీరే సాక్షి’!