దినపత్రికల ఆదివారం సంచికలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. విషయం సండే మేగజైన్ గురించి కాదు. మెయిన్ ఎడిషన్లోనే ఎడిటోరియల్ పేజీ ఒకటి ఉంటుంది… తెలుసు కదా? ఇందులో సహజంగా కాలమిస్టులకు ప్రాధాన్యతనిస్తుంటారు. కాలక్రమేణా పత్రికల యాజమానులకు, ఎడిటర్ల భావాలకు ఇది వేదికగా మారిందనేది అందరికీ తెలిసిందే. ఎడిటోరియల్ పేజీల్లోని వ్యాసాలు పత్రికల భావాన్ని, లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంటాయన్నది నానుడి. ప్రస్తుత పత్రికల్లో ఈ భావజాలం, లక్ష్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకోండి.
కాకపోతే ఒకే అంశం మీద భిన్న కోణాల్లో పరస్పర ప్రత్యర్థి పత్రికల్లో వ్యాసాలు వస్తే ఎలా ఉంటుందన్నదే అసలు చర్చ. ఇదిగో ఇటువంటి చర్చకు ఆస్కారం కలిగించే విధంగా ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు ఒకే అంశంపై భిన్న కోణాల్లో ఈరోజు వ్యాసాలు ప్రచురించడం విశేషం. ఇటీవల జరిగిన ఐటీ దాడులు, చంద్రబాబు మాజీ పీఎస్, రూ. 2 వేల కోట్ల మొత్తపు అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకష్ణ తన కొత్త పలుకు కాలమ్ లో తనదైన శైలిలో రాయగా, ‘బిగ్ బాస్ దొరికాడు!’ అంటూ సాక్షిలో వ్యాసం ప్రచురితమైంది. ఇదిగో ఇలా ఒకే అంశంపై ‘ఈ రెండు పత్రికలు’ రాసిన తీరును నర్మగర్భంగానే వెటకరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ దారా గోపి తన ఫేస్ బుక్ వాల్ పై రాసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భలే పేలుతున్నాయి. ఈ వ్యాఖ్యాల్లోని భావం, దాని అర్థం, పరమార్థం అర్థం చేసుకునేవారి శక్తి మీద ఆధారపడి ఉండవచ్చు. ఇంతకీ విషయం మీకు అర్థమైనట్లేగా!